ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Mar 26, 2020 , 23:48:01

ఉచిత రేషన్‌

ఉచిత రేషన్‌

  • రంగారెడ్డి జిల్లాలో బియ్యం పంపిణీ షురూ
  • ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున పంపిణీ
  • ప్రతి రేషన్‌ దుకాణంలో రోజుకు  40మందికి..
  • రూ. 1500 నగదు బదిలీకి అధికారుల ఏర్పాట్లు
  • వికారాబాద్‌ జిల్లాలో ప్రారంభానికి సన్నాహాలు
  • హ్యాండ్‌వాష్‌ సౌకర్యం లేకుంటే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ గురువారం ప్రారంభం అయ్యింది. రేషన్‌ దుకాణాల ద్వారా రోజుకు 40మందికి.. ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున అందజేశారు. బయోమెట్రిక్‌ పద్ధతిలో ఇస్తున్నందున ప్రతి దుకాణంలో లబ్ధిదారులు హ్యాండ్‌వాష్‌ చేసుకునేందుకు శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచారు. సామాజిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లాలో రేషన్‌ పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభించనున్నారు. దుకాణాల్లో శానిటైజర్లు లేకుంటే బియ్యం తీసుకోవద్దని, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. కాగా రంగారెడ్డి జిల్లాలో 5.25 లక్షల మంది, వికారాబాద్‌ జిల్లా పరిధిలో 8.07 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో రాష్ట్రం లో లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం పేదలు ఆకలితో ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో గురువారం రేషన్‌ పంపిణీ కార్యక్ర మం ప్రారంభించింది. ఆమనగల్లు బ్లాక్‌ మండలాల్లో  అన్ని గ్రామాల్లో తహసీల్దార్‌ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చేరవేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. డీలర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రెవెన్యూ బృందం వివరించారు. దుకాణం వద్ద తప్పనిసరిగా సామాజిక దూరం ఉండేలే చర్యలు తీసుకున్నారు. లబ్ధిదారులు గుంపులు గుంపులుగా దుకాణాల వద్దకు రాకుండా ప్రత్యేకంగా సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు కూడా నిబంధనలు పాటించి రేషన్‌ సరుకులు తీసుకెళ్లాలని అధికారులు కోరారు. ఆమనగల్లు మండలంలో 23దుకాణాలు ఉండగా తొలిరోజు 10దుకాణాల్లో రేషన్‌ ప్రారంభించామని శుక్రవారం మిగతా 13దుకాణాల్లో రేషన్‌ పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.

ఆదిబట్లలో...

ఇబ్రహీంపట్నం మండలంలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో 37పౌరసరఫరాల దుకాణాల ద్వారా రేషన్‌ బియ్యాన్ని నిరుపేదలకు అధికారులు అందజేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజల్లో కరోనా వైరస్‌పై అవగాహన పెరిగింది. ఎలిమినేడు, ఉప్పరిగూడ, పోచారం గ్రామాల్లో రేషన్‌ దుకాణాల ముందు ప్రత్యేక సామాజిక దూరం పాటిస్తూ ... ప్రజలు రేషన్‌ బియ్యాన్ని తీసుకున్నారు. ఆదిబట ్లమున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌, మంగల్‌పల్లి, పటేల్‌గూడ, బొంగుళూర్‌, రాందాస్‌పల్లి గ్రామాల్లో రేషన్‌ బియ్యం కోసం ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ... క్యూ కట్టారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు 12కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. 

యాచారంలో....

మండలంలోని అన్ని గ్రామాల్లో మనిషికి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం గురువారం జోరుగా కొనసాగింది. రేషన్‌ షాపుల వద్ద సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ ప్రజలు బియ్యం తీసుకున్నారు. బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీఓ అమరేందర్‌, తహసీల్దార్‌ నాగయ్య, ఉపతహసీల్దార్‌ భాస్కర్‌ పరిశీలించారు. కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడకుండా సోషల్‌ డిస్టేన్స్‌ను కొనసాగిస్తూ బియ్యం సరఫరా చేయాలన్నారు. అర్హలందరికీ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆర్డీఓ సూచించారు. 


logo