బుధవారం 03 జూన్ 2020
Vikarabad - Feb 03, 2020 , 23:53:36

పథకాలను పక్కాగా అమలు చేస్తా

పథకాలను పక్కాగా అమలు చేస్తా

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వ్యవసాయం, జీవనోపాధికి మొదటి ప్రాధాన్యతనిస్తామని జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పౌసుమి బసు తెలిపారు. సోమవారం నూతన కలెక్టర్‌గా పౌసుమి బసు బాధ్యతలు స్వీకరించారు. అయితే కలెక్టర్‌గా పనిచేసిన మస్రత్‌ ఖానమ్‌ ఆయేషాను బదిలీ చేసిన ప్రభుత్వం సెర్ప్‌ సీఈవోగా పనిచేస్తున్న పౌసుమి బసును ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలను పక్కాగా అమలు చేస్తామన్నారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులతో సమీక్షించి ఆయా శాఖల్లో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలనేది నిర్ణయిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశమై జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏమైనా ప్రణాళికలను చేశారా, రెవెన్యూకు సంబంధించిన డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జిల్లా నూతన కలెక్టరేట్‌ పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి తదితర వివరాలను కలెక్టర్‌ తెలుసుకోవడంతోపాటు అనంతరం కలెక్టరేట్‌లోని అన్ని శాఖల కార్యాలయాలకు వెళ్లి పరిశీలించారు.


తొలిసారి కలెక్టర్‌గా బాధ్యతలు...

జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పౌసుమి బసు తొలిసారి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే గతంలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసినా.. కలెక్టర్‌గా తొలిసారి జిల్లాకు నియమితులయ్యారు. అయితే జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు 2007లో యూపీఎస్సీ సివిల్స్‌లో 31వ ర్యాంకుతో ఐఏఎస్‌గా ఎంపికైంది. 2008-2009 వరకు ఆమె మొదట ఏలూర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. తదనంతరం 2009-11 వరకు పాల్వంచ సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కలెక్టర్‌ 2011 నుంచి 2014 వరకు తూర్పు గోదావరి జిల్లా కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారిగా పనిచేశారు. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 2016 వరకు వరంగల్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, 2016-17 వరకు కరింనగర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పౌసుమి బసు బాధ్యతలు నిర్వర్తించారు. తదనంతరం 2017 నుంచి సెర్ప్‌ సీఈవోగా పనిచేస్తూ గ్రామీణ పేదరికాన్ని రూపు మాపేందుకు కొత్త కొత్త కార్యక్రమాలను అమలుచేస్తూ మూడేండ్లపాటు సెర్ప్‌ సీఈవోగా తనదైన ముద్ర వేశారు. 


స్వస్థలం కోల్‌కతా.. పుట్టింది వైజాగ్‌లో..

జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు స్వస్థలం కోల్‌కతాలోని జంషెడ్‌పూర్‌కాగా, ఆమె పుట్టింది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం. కలెక్టర్‌ కుటుంబానికి సంబంధించి తల్లిదండ్రులు పీకే బసు(ఇంజనీర్‌), కల్పన బసు. భర్త  ప్రశాంత్‌ ఆనంద్‌ ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. నాలుగో తరగతి, నర్సరీ చదువుతున్న ఇద్దరు కుమార్తెలున్నారు. విద్యాభ్యాసానికి సంబంధించి ప్రాథమిక విద్య మొత్తం వైజాగ్‌లోనే చదవగా, ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు కోల్‌కతాలో, తదనంతరం ఢిల్లీలోని జేఎన్‌టీయూలో జాగ్రఫీలో ఎమ్మెస్సీతోపాటు పీహెచ్‌డీ పూర్తి చేశారు. తదనంతరం 2007లో సివిల్స్‌లో 31వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 


logo