శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jan 20, 2020 , 23:56:44

పరిగిలో క్లీన్‌ స్వీప్‌ చేస్తాం

పరిగిలో క్లీన్‌ స్వీప్‌ చేస్తాం


పరిగి, నమస్తే తెలంగాణ: పరిగిలో మున్సిపల్‌ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. సోమవారం పరిగి మున్సిపల్‌ పరిధిలోని 2, 5, 7, 9, 12 వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించిన ప్రజలు మున్సిపాలిటీలోను టీఆర్‌ఎస్‌ పాలన కావాలని కోరుతున్నారని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి కనిపిస్తున్న ఆదరణ ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ పరంగా నిర్వహించిన సర్వేల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ పరిగి మున్సిపాలిటీలో అన్ని స్థానాలు గెలుచుకుంటుందని తేలిందన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీనే విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. గత ఆరేండ్లుగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అటూ అభివృద్ధి, ఇటూ సంక్షేమాన్ని సమానంగా చేపట్టిందన్నారు.

దేశంలోనే అత్యధికంగా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు. కొత్త మున్సిపల్‌ చట్టంతో మరింత పారదర్శక పాలన ప్రజలకు అందనుందని పేర్కొన్నారు. 75 చదరపు గజాల లోపు స్థలంలో ఇంటినిర్మాణ అనుమతులకు ఒక్క రూపాయి చెల్లిస్తే చాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని మోసపు మాటలు చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. రాబోయే నాలుగు సంవత్సరాలు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని ఆయన అన్నారు. త్వరలోనే తుంకులగడ్డలో 300 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, వాటిలో అర్హులైన పేదలకు అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే వివరించారు. 57 ఏండ్లు నిండిన అర్హులైన పేదలకు త్వరలో ఆసరా పెన్షన్‌లు అందనున్నాయని, ప్రతి ఒక్కరికి మేలు చేసే అంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆర్‌.ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్‌ మాజీ అధ్యక్షుడు ఎ.సురేందర్‌కుమార్‌, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు హఫీజ్‌, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గౌస్‌పాష, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


logo