Vastu Shastra | మేము ‘కూజాలు – కుండలు’ తయారు చేస్తాం. మాకు వాస్తు వర్తిస్తుందా?
– ఎస్. శంకర్, శంకర్పల్లి.
తప్పకుండా! ‘కుమ్మరి సోదర’ కుటుంబాలు ఎంతో నైపుణ్యంతో మట్టి కూజాలు, కుండలు, ముంతలు, మూకుడులు, ప్రమిదలు తయారుచేస్తారు. మీరు తప్పకుండా మీ వృత్తికి సంబంధించి వాస్తును పాటించాల్సిందే. కుండలు తయారుచేసే ‘సారె’ (కుమ్మరి చక్రం) తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ పెట్టుకోవాలి. కుమ్మరి వామి (స్టోర్) వాయవ్యం లేదా ఆగ్నేయంలో పెట్టాలి. ఇంటిని స్థలానికి మొత్తంలో నైరుతి భాగంలో కట్టుకోవాలి. ఒక గుంత తీసి కుమ్మరి మట్టి సానబెడుతారు. ఆ గుంతను ఈశాన్య భాగంలో చేసుకోవాలి. ‘కుమ్మరి బట్టి’ని మొత్తం స్థలానికి ఆగ్నేయంలో పెట్టుకోవాలి. మొత్తం స్థలానికి ‘ఫెన్సింగ్’తోకానీ, వైర్లతో లేదా రేకులతో ప్రహరీ చేసుకోవాలి.
డూప్లెక్స్ ఇంటికి ‘హాలో’ (సీత్రూ) ఉత్తరంలో పెట్టాలా? పడమరలో అయినా ఉండొచ్చా? మెట్లు బయట కడుతున్నాం.
– జి. అంజన్ యాదవ్, సికింద్రాబాద్.
ఇంట్లోంచి మెట్లు కట్టకుండా ‘హాలో’ అనే మాట రాదు. ఎందుకంటే డూప్లెక్స్ అంటే రెండు ఇండ్లను వాడుకోవడం. అది కూడా లోపలి నుంచి. అంతేకానీ, మెట్లు బయట పెట్టి ఒకదాని మీద ఒక ఇల్లు కట్టినప్పుడు అది రెండు అంతస్తుల ఇల్లు అవుతుంది. దానిని డూప్లెక్స్ అనరు. లేదూ, లోపల మెట్లు పెడితే స్లాబ్ కట్ చేయడం (సీత్రూ) అనేది పడమర వైపు కాకుండా తూర్పు సెంటర్లో లేదా ఉత్తరం సెంటర్లో రావాలి. ఇంటి గర్భం మధ్యలో కూడా ‘సీత్రూ’ (హాలో) పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మెట్లు బయట పెట్టుకోవాలి అంటే, డూప్లెక్స్ ఇల్లు కట్టే ఆలోచనను మానుకోవాలి. లేదా లోపలా బయటా కూడా సరైన చోట మెట్లు కట్టుకోవాలి. అంతేకానీ వాస్తును ఉల్లంఘించడానికి వీల్లేదు.
ఇంటి లోపల మెట్లు ఆగ్నేయంలో వేసుకోవచ్చా? దీనివల్ల వాస్తుకు విరుద్ధంగా వ్యవహ రించినట్టు అవుతుందని కొందరు అంటున్నారు. నిజమేనా?
– ఎస్. వీరన్న, కోమటిబండ.
గృహం లోపలి భాగంలో మెట్లు రావడానికి సరైన స్థానాలు పడమర సెంటర్ లేదా దక్షిణం సెంటర్. ఆ చోట్లు కుదరక పోతే దక్షిణం వైపు ‘ఉచ్ఛభాగం’ అంటే.. తూర్పు ఆగ్నేయం కిచెన్ స్థానం కాకుండా మెట్లకు సరిపడిన స్థలం తీసుకొని, ఆ చోట వేసుకోవచ్చు. మెట్ల మందమే అక్కడ స్లాబ్ కట్ చేసినప్పుడు ఉత్తర భాగంలో ‘సీత్రూ’ అవసరం ఉండదు. అలాగే ఉత్తరం వైపు వాయవ్యంలో కూడా మెట్లు వేసుకోవచ్చు. ఎక్కడ మెట్లు వేసినా ముందుగా పడమర వైపు లేదా దక్షిణం వైపు చూస్తూ ఎక్కే విధంగా మెట్లు వేసుకోవాలి. ఈశాన్యంలో, నైరుతిలో, తూర్పు-ఉత్తర దిశల్లో ఇంట్లో మెట్లు వేయవద్దు.
బట్టల దుకాణం పడమర ముఖంగా ఉండొచ్చా? లేదంటే, మరో వైపు ఉండాలా?
– ఎస్. లింగేశ్వర్, భువనగిరి.
దుకాణాల దిశ ఎటున్నా.. ఆ దిశకు కట్టుకోవచ్చు. దక్షిణం-పడమర ముఖం పెట్టి ‘బట్టల షాపు’ కట్టవద్దు అన్న నియమం లేదు. ఉత్తరం, తూర్పు దిక్కులకు మాత్రమే ఉండాలనుకోవడం తప్పు. వ్యాపారం చేసినా, గృహం కట్టినా ఆయా దిశలకు అనుగుణమైన శాస్త్ర సలహాలతో, సూచనలతో నిర్మాణాలు చేపట్టాలి. అంతేకానీ, కొన్ని దిశలను శాస్త్రం నిషేధించలేదు. కాబట్టి ‘మిడిమిడి’ జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ‘మనిషి పరిమితుడు’ అన్నది మరువద్దు. మీరు మీ షాపును పడమర ముఖంగా ఓపెన్ చేసుకొని, షాపులో ఉత్తరం ముఖంగా గల్లా పెట్టెను ఎడమవైపు పెట్టుకొని, నైరుతి స్థానంలో కూర్చొని వ్యాపారం చేయండి. పశ్చిమ నైరుతి భాగాన్ని గ్లాస్‌తో మూసి, పశ్చిమ వాయవ్యం షాపులోకి ఎంట్రీ పెట్టండి.
పొలం దగ్గర కాంపౌండు లేకుండా ఇల్లు కడితే దోషమా?
– ఎస్. మనోహర్, హన్మకొండ.
వ్యవసాయ క్షేత్రం విశాలంగా ఉంటుంది. ఇంటి స్థలం గజాల్లో ఉంటుంది. ఇల్లు కట్టినప్పుడు తప్పక ప్రహరీ కట్టాలి. కానీ, మొత్తం పొలానికి ప్రహరీ అవసరం లేదు.. కడీలు నాటి ఫెన్సింగ్‌తో హద్దు చేసుకోవచ్చు. కానీ, ఇల్లు వేరు. ఇంటికి, మన పొలం సరిహద్దుకు చాలా దూరం ఉంటుంది. వ్యవసాయ స్థలం నైరుతి-ఈశాన్యాలు ఎంతో పెద్ద పెద్ద దూరాలతో ఉంటాయి. కాబట్టి అక్కడ కట్టే ఇంటికి ప్రహరీలు తప్పనిసరి. బస్తాలో ఉన్న బియ్యం వంటకోసమే కానీ, ఇద్దరి కోసమే బస్తా బియ్యం వండం కదా! ఇదీ అంతే. ఇంటికి తగ్గ ప్రహరీ, ప్రహరీకి తగ్గ ఇల్లు ఉండాలి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678