Vastu shastra | నా తరువాత నా పిల్లలకు ఇల్లు చెందాలంటే ఏ పేరుతో కట్టాలి. నాకు మగ పిల్లలు లేరు. నన్నేం చేయమంటారు?
– వి. రాధ, భువనగిరి
‘గృహం’ సకల గుణ శోభితం. సర్వ శుభ లక్షణ సమన్వితం. ఏది నివాస స్థానమో, ఏది ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యాలను సమకూరుస్తుందో.. అలాంటి సూత్రాలతో విభ
జనతో నిర్మితమవుతుందో దానినే ‘గృహం’ అంటారనీ, అదే లక్ష్మీ స్వరూపమనీ శాస్ర్తాలు చెబుతూ ఉంటాయి. పంచ భూతాలతో ప్రతి దిశకు ప్రాధాన్యం ఇస్తూ నిర్మించే ఇల్లు ఒక్క తండ్రికే కాదు.. అతని వారసులందరికీ కేవలం కొడుకులకే కాదు.. కూతుళ్లకు కూడా పనికి వస్తుంది. ఇది ‘కలియుగం’ యుగ ధర్మాలు మరిచి, మాట్లాడటం సరికాదు. మీరు ఏ పేరుతో కట్టినా, ఎవరి కోసం కట్టినా, దానిని శాస్త్రబద్ధంగా రాజీ పడకుండా కట్టండి. మీకు తోచినట్టు, మీ ఇష్టానుసారంగా కట్టకండి. ‘వాస్తు ఇష్టానుసారం’ కట్టండి. అది అందరికీ శుభాలనే అందిస్తుంది. ఇల్లు ‘మనుష్యాలయం’ అన్న విషయం మరువొద్దు. వాస్తు శాస్ర్తాన్ని పాటించడం అన్నివిధాలా ఉత్తమం. ప్రకృతి సూత్రాలను కాపాడటం మనిషి బాధ్యత.
మా ఇంటికి మధ్యలో ‘తూర్పు దిక్కు’ కారు పార్కింగ్ కోసం సెల్లారు ఉంది. మంచిదేనా? కొంతమంది తొలగించమని చెబుతున్నారు.
– సందు కృష్ణ మోహన్, శంషాబాద్.
కొందరు బిల్డర్లు తూర్పులో సెల్లార్ తీయవచ్చు కదా అని ఇంటిని తూర్పుభాగం ‘కట్ చేసి’ అంటే.. ఇల్లుకు తూర్పులో గొయ్యి తీసి, అందులోకి వెళ్లడానికి ఎత్తు సరిపోదని ఇల్లు తెంపి ‘యు’ ఆకారంలో కడుతున్నారు. ఆ విధానం చాలా తప్పు. తూర్పు సెల్లారు, ఈశాన్యం సెల్లారు తీయవచ్చు అన్నది నిజమే. కానీ, ఇండ్లు తూర్పు వైపు కట్చేసి కాదు. పడమర వీధి ఉన్న ఇంటికి పశ్చిమ వాయవ్యం నుంచి తూర్పు దిక్కు వెళ్లే విధంగా సెల్లార్ తీసుకొని, ఆ భాగాన్ని లేదా ఈశాన్యం భాగాన్ని కారు పార్కింగ్ కోసం వాడవచ్చు. మీ గృహం తూర్పు భాగం తెగిన దోషంతో ఉంది. ఆ చోట ఇల్లు కలుపుతూ ఆ తెంపు చేసిన భాగాన్ని ఇంటిలోకి కలపండి. అప్పుడే ఆ దోషం పోతుంది. వీలు కాకపోతే ఇల్లు మారండి. వాస్తుశాస్త్రం మనిషి హితం కోసం ప్రాణంపోసుకున్నది. ఆ నియమాలను ఉల్లంఘించకండి.
మా ఇంటికి రెండు డోర్లు, ఒక కిటికీ ఎదురెదురుగా.. మూడు అవుతున్నాయి. అలా ఉండవచ్చా?
– కాలె చంద్రమోహన్, పారుపల్లి.
కిటికీలు, ద్వారాలు.. ఇంటి గదుల విభజనను బట్టి, కొలతలను బట్టి వరుసగా మూడు లేదా నాలుగు.. ఒక్కోసారి ఒక ఆర్చితో కలిపి మూడు కూడా వస్తుంటాయి. అవి ఎన్ని వచ్చినా, ఎదురెదురు వచ్చినా దోషం కాదు. వరుస ద్వారాలు ఉచ్ఛమైనవేనా? లేక ఒకటి అటు ఒకటి ఇటు.. ‘వంకర టింకర నడకలతో’ ఉన్నాయా? అన్నది చూసుకోవాలి. వరుసగా వచ్చినప్పుడు అవి దోషం కాదు. ద్వారాలతోపాటు చివర కిటికీ కూడా ఎదురుగా రావచ్చు. అలా రావడం కూడా దోషం అనిపించుకోదు. ఎటొచ్చీ నీచ స్థానంలో ద్వారాలు, కిటికీలు రాకుండా చూసుకుంటే చాలు. ఉచ్ఛమైన ద్వారాలు వరుసగా వస్తే.. ‘సంఖ్యా’పరమైన దోషం ఉండదు. పట్టించుకోవద్దు.
ఇంటికి నైరుతిలో ‘సర్వెంటు గది’ ఉండొచ్చా? దీనివల్ల యజమానికి ఏమైనా ఇబ్బందా?
– బి. ప్రమోద్, గండిమైసమ్మ.
‘మేడ్ గదులు – స్టాఫ్ గదులు’ అని కొంతభాగాన్ని ఇంటిమూలల్లో ఏర్పాటు చేస్తున్నారు. అది ‘శాస్త్ర సమ్మతం’ కాదు. అలా దిక్కులలో ఇవ్వడం వల్ల ఆ దిశలు ప్రధాన గృహంలో లోపించి, ముందుముందు చాలా పెద్ద సమస్యలు రావడానికి దోహదం చేస్తాయి. సర్వెంట్ గదులు ఉప గదులుగా భావించి, వాటిని ఇంటి ‘నక్ష నుంచి’ తప్పించాలి. అప్పుడు ఇల్లు ‘అష్ట దిశలతో’ అలరారుతుంది. ఇంటికి వాయవ్యంలో లేదా దక్షిణంలో, పడమరలో, ఆగ్నేయంలో ఈ స్టాఫ్ గదులను కట్టుకోండి. అది ఇద్దరికీ మంచిది. అందరూ బాగుంటేనే కదా అందరికీ సౌఖ్యం కలుగుతుంది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ, suddalavasthu@gmail.com, Cell: 7993467678