Vasthu Shastra | మా స్కూలు భవనం పడమర ముఖంగా ఉంది. దానిలో ‘సాంస్కృతిక వేదిక’ ఎటువైపు కట్టాలో సలహా ఇవ్వగలరు?
– వి.సోమిరెడ్డి, బోరబండ
పాఠశాల భవనం ఏ దిశకు ఉన్నా అన్నీ చక్కగా అమర్చుకోవచ్చు. స్థలం ఎక్కువగా ఉంటే శాస్ర్తానుసారం కుదురుతుంది. మీ పాఠశాల భవనం గేటు పడమర ఉంది. కానీ, మీ ప్లాను ప్రకారం మీరు తూర్పు – దక్షిణం ‘ఎల్’ ఆకారంలో నిర్మించారు. అది సరైంది కాదు. కానీ, మీ పాఠశాల సాంస్కృతిక వేదికను స్కూలు ఎదుట దక్షిణంలో ఉత్తరం ముఖంగా కట్టండి. బడి వేదికలో ‘గ్రీన్ రూములు’ రావు. ఎందుకంటే అది గ్రౌండ్లో వస్తుంది. అక్కడ కట్టకూడదు. మీ పాఠశాలలో పిల్లల టాయిలెట్లు ఉత్తర – ఈశాన్యంలో కట్టారు. ఆ దిశ దోషం. దానిని తొలగించి, ‘ఉత్తర – వాయవ్యంలో కట్టుకోండి’. దాని సెప్టిక్ ట్యాంకును ఉత్తరం సెంటర్లో కట్టండి. మీ సైకిల్ స్టాండ్ ఉత్తరం కాంపౌండును ఆనుకొని ఉంది. దానిని ప్రహరీని తాకకుండా వేరుచేసి కట్టండి.
మేము హాస్పిటల్ కట్టాం. ఉత్తరం రోడ్డుకు గేటువద్ద లోపలికి తీసుకున్నాం. అలా ఉండొచ్చా? ఉండకూడదా?
– కె.మునిస్వామి, మేడ్చల్
చాలామంది వాహనాలు పోవడానికి, రావడానికి మెయిన్ రోడ్డు గేటును ‘విజన్ కోసం’ గేటు వద్ద ‘యూ’ ఆకారంలో ప్రహరీని కట్టి వాడుతుంటారు. అది అవసరమే అయినా.. తూర్పు ముఖం, ఉత్తర ముఖం ఉన్నవారికి మంచిది కాదు. మీరు ఉత్తరం ఒక ‘ఫుట్పాత్’ కట్టండి. ఆ ఫుట్పాత్ ఆరు అడుగులు ఉండాలి. ఆ పాత్ను ఆనుకొని కాంపౌండ్ కట్టండి. అప్పుడు రోడ్డు వైపు గేటువద్ద ఆరు అడుగుల గేటు లోపలికి ఉంటుంది. అలా కడితే ఉత్తరం గేటును నేరుగా కాంపౌండును మార్చకుండా అంటే.. ‘యూ’ ఆకారం కాకుండా నేరుగా ప్రహరీకి కట్టి, దానికి ‘మెట్నకు గేటు’ ఉత్తరం ముఖంగా పెట్టవచ్చు. రోడ్డుపైకి వెళ్లడానికి ఆ గేటు అనుకూలంగా వాస్తుకు అనుగుణంగా ఉంటుంది. దోషం ఉండదు. అలా తూర్పునకు కూడా అమర్చవచ్చు.
రైస్ మిల్లు ముందర విశాలమైన స్థలం కావాలి. మాది దక్షిణం రోడ్డు. ఎలా కట్టాలి?
– కె. వీరదాసు, హయత్నగర్
దక్షిణం రోడ్డు వచ్చినప్పుడు దక్షిణంలోని ఆగ్నేయంలో ప్రధానమైన గేటు పెట్టండి. మీ స్థలంలో ఉన్న కొలతను అనుసరించి పడమరలో ప్రధానమైన ‘రైస్ మిల్లు’ కట్టండి. తూర్పులో అవసరమైన స్థలం వదలండి. దక్షిణం ఆగ్నేయం నుంచి తూర్పు హద్దు నుంచి రోడ్డు వేసుకొని, మిల్లు తూర్పు-ఈశాన్యం ప్రధాన ద్వారం వద్దకు వచ్చేలా ‘ఎల్’ ఆకారంగా రోడ్డు వేసుకొని వాడాలి. అప్పుడు రోడ్డు లోపలి భాగమంతా ‘వడ్లు ఆరబోయడానికి, బియ్యం సంచులు పెట్టడానికి’ స్థలం కేటాయించవచ్చు. ప్రధాన ఆఫీసును నైరుతిలో కాకుండా ఈశాన్య భాగంలోనే పెట్టుకోవాలి. ఆ ఆఫీస్లో మట్టి గద్దెలు కట్టకుండా, నేల మీద కూర్చొని లేదా ‘టేబుల్ కుర్చీ’ వేసుకొని కార్యకలాపాలు సాగించవచ్చు. మిల్లు చుట్టూ ‘ప్రహరీ’ నిర్మించాలి. ‘స్టాఫ్ గదులు’ వాయవ్యంలో కట్టుకోవాలి. ‘సెప్టిక్ ట్యాంక్’ ఉత్తరంలో పెట్టుకోవాలి.
మాది చేనేత కుటుంబం. మేము మగ్గం ‘గుంత’ను ఎటు దిక్కున పెట్టుకోవాలి? రెండు మగ్గాలు సాపు కోవాల్సి ఉంటుంది.
– జి.వెంకటేశం, సిరిపురం
చేనేత కార్మికులు ఎక్కువగా వస్ర్తాల నేతను ఇంటివద్దే ఏర్పాటు చేసుకుంటారు. అందుకే, గృహాలను విశాలమైన స్థలంలో కట్టుకుంటారు. చాలామంది నేత కార్మికులు మగ్గం వృత్తికి ప్రధానమైన గుంతను ఇంటిలోని హాలులో ‘నైరుతిలో’, ‘వాయవ్యంలో’ పెట్టుకొని ఆ గుంతలోనే మునిగిపోతున్నారు. మగ్గాలు సాపుకొనేటప్పుడు మనం కూర్చునే ముఖం పడమరగా, దక్షిణంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఇంటి హాలులో ఉత్తరం వైపు, ఉత్తర – ఈశాన్యంలో గుంత పెట్టుకొని, దక్షిణం ముఖంగా మగ్గం అమర్చుకోవాలి. లేదా తూర్పులో గుంత పెట్టుకొని పడమర ముఖంగా కూర్చొని వస్ర్తాలను నేయాలి. అందుకు తగినట్లుగా ఇంటిని సెట్ చేయాలి. రెండు మగ్గాలు కావాలంటే తూర్పు – ఈశాన్యంలో, ఉత్తర – ఈశాన్యంలో గుంటలు పెట్టుకొని.. ఒకరు దక్షిణంగా, మరొకరు పడమర దిశగా కూర్చొని నేసుకోవాలి. ఇంటికి ప్రధానంగా తూర్పు, ఉత్తరాలు వరండాలు పెట్టుకోవాలి. ‘స్టాండు’ మగ్గాలు పెట్టుకొంటే తూర్పు ముఖంగా, ఉత్తర ముఖంగా కూర్చోవచ్చు. ఎందుకంటే, వాటికి ‘గుంతలు’ ఉండవు .
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678