అప్పుడప్పుడూ ప్లేగు, కరోనా వంటి రోగాలు ఎందుకు వస్తాయి? దానికి దేశం కారణం అవుతుందా? గృహాలు అవుతాయా?
– ఎస్. చంద్రమోహన్, కల్లూరు.
మనుషులు, వారి కార్యకలాపాలే కారణం. ఈ విషయంలో వేదపరంగా ఒక మాట ఉంటుంది. ‘ధర్మ వర్తన లేనిచోటును విపరీత రోగాలు ఆక్రమిస్తాయి’ అని. ఇది కాస్త ఆశ్చర్యంగా, పొంతనలేనిదిగా అనిపించినా.. వ్యక్తి నియమ నిష్ఠలు, నిబద్ధత, నిజాయతీ, అతని ఔన్నత్యం ఇందులో ఇమిడి ఉంది. భూమ్మీద మనిషి కేంద్ర బిందువు. అతని కిరాతకపు ఆలోచనలు-ప్రకృతి అంతరంగాన్ని కకావికలు చేస్తున్నాయి. సృష్టిమూలాలను నాశనం చేసే ఆధునికీకరణ, ఆయుధ సామగ్రి తయారీ, ఆ వినాశ వస్తు సముదాయం కోసం ప్రకృతిని హత్య చేస్తున్న తీరుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మనకన్నా పూర్వం, అలాగే యాభై ఏండ్లకు ముందు చూస్తే కూడా ఇంత విపరీతపు ప్రకృతి ఉప్పెనలు, రోగాల విజృంభణ కానరాదు. రానురాను సుఖాల అభిలాషలో సృష్టి ధ్వంసం పెరుగుతున్నది. అది మానవాళిని కబళిస్తుంది. ఏదైనా ‘అతి’ మంచిదికాదు కదా! సహజత్వానికి దూరమవుతున్న జీవన విధానం, కృత్రిమత్వపు భావజాలం, వస్తుగత – యంత్రగత జీవితపు అలవాట్లు, ఒక అహంకారపూరిత వికృత చేష్టలకు పోతున్న మానవుడే.. దీనికంతటికీ ముఖ్య కారణమని చెప్పక తప్పదు. ఇందుకు మనిషి శిక్షార్హుడే. మనం మన ముందుతరాలకు ఏమి అందించబోతున్నాం? అనేది ఆలోచించాలి. ఏచోటు అయినా అది ఒకే విశ్వాత్మ అంతరంగం అని అర్థం చేసుకోవాలి. శరీరంలో ఎక్కడ గాయమైనా.. అది మనిషిని కదలనివ్వదు. అలా నేలమీద జరిగే భౌతిక దాడి-దోపిడి ఒక ప్రశ్నార్థకం అవుతుంది. మార్పు రావాల్సింది మనుషుల్లో. అది పల్లెనుంచి ప్రపంచం వరకు. లేదంటే.. మిగిలేది యుద్ధ శకలాలే! మానవ మరుభూములే! కాబట్టి, ప్రకృతికి మనిషి ఎప్పుడూ అడ్డు పడకూడదు.
మేము అన్నదమ్ములం ఇంటిని పంచుకున్నాం.మా వాటాకు పడమర ఖాళీ స్థలం, తూర్పులో మూడు గదులు వచ్చాయి. అందులో అమ్మవారు ఉంది. ఇల్లు ఎలా కట్టాలి?
– కె. చంద్రకళ, షాద్‌నగర్.
మీరు పెద్దవాళ్లు కాబట్టి మీకు పడమర స్థలం ఇచ్చారు. అది దోషంకాదు. మీకున్న పడమర ఖాళీ స్థలంలోనే మీరు నూతన గృహం కట్టాల్సి వస్తుంది. అందులో వేరే ఆలోచన వద్దు. కాబట్టి, మీకు తూర్పులో ఆ మూడు గదులు తొలగించాలి. తప్పదు. ఆ గదుల్లో అమ్మవారు ఉన్నాకూడా.. ముందు ఇల్లు తయారుచేసుకొని నూతన గృహంలోని తూర్పు భాగంలో పూజగది కట్టుకోండి. అందులోకి అమ్మవారిని చేర్చండి. తూర్పులోని అమ్మవారిని ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు అది అద్దె ఇల్లు అయినా.. మీతోపాటు పెట్టుకొని, నిత్యం పూజాదికాలు చేసుకోవాలి. కొత్త ఇల్లు కట్టుకున్నాక.. మీతోపాటు అమ్మవారినీ తీసుకుపోవాలి. ఆ మూడు గదులు తీసి.. ఇంటి ప్లాను చేయాలి. ఏ దోషం ఉండదు. మాది పాత ఇల్లు. పెద్దది. దాని గోడలమీద స్లాబు వేసుకోవచ్చా?
– కె.ఎల్. కౌశిక్, గద్వాల.
ఒకనాడు గోడలమీదనే రెండు అంతస్తులు కట్టిన భవనాలు ఉన్నాయి. పునాదులు బలంగా ఉన్నప్పుడు, రెండు అడుగుల గోడలు ఉంటే.. దానిమీద స్లాబు వేసుకోవచ్చు. మీది పాత ఇల్లు అంటున్నారు. పైగా చాలా పెద్దది. దానిలో ముందుగా వాస్తు లోపాలను సవరించాలి. మీరు పంపిన ప్లానులో నైరుతిలో వంటశాల పెట్టారు. దాన్ని ఆగ్నేయంలోకి మార్చండి. లేదా ఇంటి బయట ఉండాలి అంటే.. వాయవ్యంలో సపరేటుగా పెట్టుకోండి. ముఖ్యంగా మీ ఇంటికి చుట్టూ ఖాళీ స్థలం రకరకాలుగా పెరిగి ఉంది. దానిని సవరిస్తూ చుట్టూ ప్రహరీ కట్టండి. అప్పుడు మీకు మంచి వాస్తుగృహం ఏర్పడుతుంది. సెప్టిక్ ట్యాంక్‌ను తూర్పు మధ్యలో కానీ, ఉత్తరం మధ్యలోకానీ పెట్టండి. దక్షిణం రోడ్డు కాబట్టి.. దక్షిణ ఆగ్నేయంలో గేటు పెట్టండి.
2. ఊరిలో అమ్మవారి గుడికి దగ్గర స్థలం ఉంది. అందులో ఇల్లు కట్టుకోవచ్చా? పడమర రోడ్డు మాది.
– ఎస్. రవి, కోరుట్ల.
అమ్మవారి గుడి మీకు దక్షిణం లేకుండా ఉంటే ఇబ్బంది కాదు. తూర్పు వైపున ఉన్నా ఫరవాలేదు. అలాగే, అమ్మవారి గుడికి నాలుగు వైపులా మాడ వీధులు ఉన్నా బాగుంటుంది. మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మీకున్న స్థలంలో మీదైన అమ్మవారి గుడి ఉన్నప్పుడు ఆలోచించాలి. అమ్మవారికి మన గృహం ఎక్కడ నిర్మిస్తున్నాం అని. మీ స్థలానికి ఎలాగూ పడమరలో రోడ్డు ఉంది. కాబట్టి, దక్షిణం గుడి లేకుంటే అందులో ఇల్లు కట్టుకోండి. గుడి ప్రహరీ ఉంటే ఆ ప్రహరీ నుంచి మూడు లేదా నాలుగు అడుగులు వదిలి.. మీ కాంపౌండ్ కట్టుకోవాలి. మీ ఇల్లుకు చుట్టూ ప్రదక్షిణ స్థలం తప్పక వదిలి, మీ గృహం వాస్తుకు కట్టుకోండి. స్థలం దిశకు కుదిరి ఉండాలి. విదిక్కులు ఉంటే.. ఆ చోట గృహం పనికిరాదు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143