Vasthu Shastra | మన ఆలయాల గర్భగుళ్లలో వెలుతురు ఉండదు. అది వాస్తు ఎలా అవుతుంది? అంటే.. చీకటి మంచిదా? అనారోగ్యకరం కాదా?
– కె. రాజశేఖర్, ఖమ్మం
చాలా మంచి ప్రశ్న. లోతుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ, సూక్ష్మంగా చెబుతాను. మన ఆలయాల అంతర్గత శక్తిని, దాని ‘లోతైన టెక్నాలజీ’ని ఆధునికులు అర్థం చేసుకోలేరు. ఆలయం వేరు, గృహం వేరు. మన యోగులు అందించిన ఆత్మ శిక్షణాలయమే.. దేవాలయం. భారతదేశానికే ఇది సొంతం. గర్భగుడిలో మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలు పెడితే, ఆలయ అంతర్గత క్షేత్రం ‘విచ్ఛిన్నం అవుతుంది’. మంత్రానికి – కాంతికి అవినాభావ సంబంధం ఉంది. మంత్రోచ్చారణతో మనసు అంతర్ముఖం చెందుతుంది. ఆ స్థితిలో వెలుతురు ఎంత ఉండాలి? ఏ నిష్పత్తితో ఉండాలి? ఆ దీపం దేనితో వెలిగించినదై ఉండాలి?.. తదితర నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతికి ఇబ్బంది కలిగించని వెలుగు కావాలి సాధకుడికి. అదీ సున్నితంగా ఉండాలి. కాబట్టి, ‘నేతి దీపం’ వెలిగిస్తారు. కిరోసిన్ బుడ్డీ పెట్టరు. కళ్లు కిరోసిన్ దీపాన్ని చూస్తే చలిస్తాయి. అసౌకర్యాన్ని పొందుతాయి. గర్భగుడి అంతర ఆకాశం కిరోసిన్ వాసనకు చచ్చిపోతుంది. అదే ప్రమిద ‘ఆవు నెయ్యి’తో వెలుగుతూ ఉంటే.. దాని ఔషధ గుణం కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది. మానసిక ఉపశమనానికి కేంద్రం అవుతుంది. మనోయాత్రను సుగమం చేస్తుంది. కాబట్టి గర్భాలయాల్లో ఎలాంటి వెలుతురు, ఎంత ఉండాలి అనేది శాస్త్రీయమైన అంశం. ఏళ్లుగా ఆలయాలు ఉన్నా.. ఏ గుడి పూజారీ గర్భగుడి వాతావరణానికి భంగపడి, అనారోగ్యం పాలైన సంఘటన లేదు చరిత్రలో! మనం చూసేది, ఆలోచించేది పరిమిత జ్ఞానంతోనే కాబట్టి కొన్ని అర్థం కావు. లోతుగా శోధిస్తే తప్ప అద్భుతాలు అవగాహన కావు. జ్ఞానం వేరు.. చదువు (డిగ్రీలు) వేరు.
ఇంటికి పోర్టికో బరువు అవుతుందా? చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు. దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి?
– జి. రాజ్యలక్ష్మి, దేవరకొండ
పందిళ్లు, పోర్టికోలు ఎప్పుడూ బరువు కావు. బరువులు అనేవి ఇంటిలోని వసతికి సూచన. రకరకాల వస్తువులు కాలికి అడ్డుగా లేకపోతేనే ఆ ఇల్లు కుటుంబ సభ్యుల రాకపోకలకు అనుకూలంగా ఉన్నట్టు. ద్వారాలు లేని మూలల్లో సోఫా లేదా కుర్చీలు ఉంటే.. వచ్చేపోయేవారికి ఇబ్బంది అనిపించదు. అలా ప్రతి గదినీ అవసరమైన వస్తువులతో చక్కగా సర్దుకోవాలి. అప్పుడే ఇల్లు పొందికగా ఉంటుంది. దీనినే ‘బరువు’ అన్నారు. అందుకే కూర్చుంటే పక్కకు జరగమనకుండా, పడుకుంటే లేవమనకుండా ఉండాలని అంటారు. ఇక పోర్టికోలు వాహనాలకు ఎండ, వాన నుంచి రక్షణనిస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకొని కడితే అందంగా, ఉపయోగకరంగా ఉంటాయి.
ఇంటి మీద పరిసరాల ప్రభావం ఉంటుందా? ఇల్లు బాగుంటే చాలదా?
– వై. రాంబాబు, బుద్వేల్
స్థానం.. ఇల్లు, ప్రాంతం అనే విషయంలో ముందు చర్చించ దగినది ప్రాంతమే. అందుకే మనవాళ్లు ‘ఎక్కడినుంచి వచ్చాడురా ఈ మహానుభావుడు’ అంటూ ఉంటారు. కారణం తాను వచ్చిన ప్రాంతం ప్రభావం ఆ వ్యక్తి మీద తప్పక ఉంటుంది. సభ్యత – సంస్కారాలు మూలాల నుంచే మొదలవుతాయి. మనిషి మనసు ప్రకృతికి ఫిదా అవుతుంది. ఆయా ప్రాంతాల వాతావరణం అటు ఇండ్ల మీదా ఉంటుంది. ఒక పెద్ద నాలా పక్కన, రైల్వే ట్రాక్ పక్కన, ఎయిర్ పోర్ట్, బస్టాండ్ పక్కన ఉండే గృహాల్లో ఆనందం శాతమెంత? అలజడి శాతమెంత? అభివృద్ధి శాతమెంత?.. అనేది బేరీజు వేసి చూసుకోవాల్సి ఉంటుంది. మనం తినే ఆహారం మంచిదే కానీ, పెంటగడ్డ మీద నిలబడి తింటే ఎలా ఉంటుంది? మన ఇంట్లోని శుభ్రమైన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటే ఎలా ఉంటుంది? అనేది మనకు తెలుసు. ఇల్లు కూడా అంతే! మంచి పరిసరాలలో మంచి ఇల్లు కట్టుకొంటే.. మంచి నాయకుడికి అధికారం లభించినట్లు ఉంటుంది. అభివృద్ధి కూడా జరుగుతుంది.
Vasthu Shastra | ‘నాస్తిక వాదం’తో చూస్తే వాస్తు తప్పు అంటున్నారు. నిజమేనా?
వాస్తు ప్రకారం అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా? ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి?
Vasthu Shastra | మాకు ఉత్తరం రోడ్డు ఉంది. ఖాళీ జాగాలో మొత్తం షాపులు కట్టుకోవచ్చా?
Vasthu Shastra | ఇంటి నిర్మాణానికి గుండ్రంగా ఉండే స్థలం పనికిరాదా?