Vasthu Shastra | నైరుతి ఇంట్లో శుభ ఫలితాలు ఉండవని అంటారు. నిజమేనా?
– డి. సాంబమూర్తి, మేడ్చల్
ప్రతి దిశకూ తనదైన శక్తి, తనవైన బలహీనతలూ ఉంటాయి. సృష్టిలో అన్నీ వేటికవే ప్రత్యేకమైన గుణాలతో అలరారుతుంటాయి. ప్రధానంగా ఏ దిశను, ఏ విధంగా కట్టాలి అనేది తెలిసి ఉండాలి. తూర్పును తూర్పుగా.. నైరుతిని నైరుతిగా నిర్మించాలి. అన్నిటికీ ఒకే మంత్రం పారదు అన్నట్టు.. తూర్పు ముఖంగా దక్షిణం స్థలంలో ఇల్లు కడితే యోగించదు. స్థలం ఎంపిక అప్పుడే ఆ దక్షిణ – పడమర రోడ్లు స్థలంలో ఎంత బలం సహజసిద్ధంగా ఉంది? ఎంతమేరకు భౌతికంగా దానికి శక్తి తీసుకురాగలం అనేది నిర్ణయించి, ఇంటి నిర్మాణానికి సిద్ధపడాలి. గుణగణాలు బాగాలేక కొన్నిసార్లు.. గొప్పగా అనుకునే తూర్పు స్థలం పనికిరాక పోవచ్చు. ఎందరో ఇష్టపడే ఈశాన్యం బ్లాకు కూడా ఎన్నో దుష్ఫలితాలకు దారితీయవచ్చు. సరైన దానిని ఎంపిక చేసుకొని, నైరుతి స్థలంలో గొప్ప ఇల్లు కట్టవచ్చు. మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఏదైనా ఎంపికను బట్టి ఉంటుంది.
స్టాఫ్ (పనివారి కోసం) గదిని ఇంటి లోపల కట్టి ఇవ్వాలా? బయట నిర్మించాలా?
– జి. సుధారాణి, స్టేషన్ ఘనపురం
ఇతరులు ఉండటానికి, మనం ఉండటానికి అని మనమే స్పష్టంగా విడదీస్తున్నాం. అంటే.. ఒకటి కాదు, రెండు ఇండ్లు అని ఒప్పుకోవాలి. రెండు ఇండ్లు అంటే.. రెండు వేర్వేరు ద్వారాలు ఉండాల్సిందేగా! ఒకరి ఇంట్లోంచి ఒకరు వెళ్లలేరు కదా! చిత్రం ఏమిటంటే.. కొందరు పెద్ద ఇంటినే కట్‌చేసి, స్టాఫ్ కోసం ఇస్తున్నారు. పైగా అపార్ట్మెంట్లలో ఈశాన్యం లేదా ఆగ్నేయం ఆయా సింహద్వారాలను బట్టి నైరుతి – వాయవ్యం మూలలను కట్‌చేసి, ఆ గదులను పనివారికి ఇవ్వడం చాలా పెద్ద దోషం. ఎక్కడైనా పనిచేసేవారికి సపరేట్గా ఇండ్లు (అవి చిన్నగా అయినా..) కట్టడం మంచి పద్ధతి. ఇంటిలో పొత్తు గది మంచిది కాదు. మన ప్రధాన ఇంటి నాలుగు విదిశలు మనమే వాడుకునేలా ఉండాలి. ముక్కలు చేసి వాడటాన్ని శాస్త్రం ఆమోదించదు.
ఒక పెద్ద స్థలంలో రెండు టవర్లను, ఇండిపెండెంట్ ఇండ్లను నిర్మించాలి. ఎక్కడ, ఎలా కట్టమంటారు?
– డి. చంద్రశేఖర్, తెల్లాపూర్
పెద్ద జాగా అనుకున్నప్పుడు ముందుగా స్థలం మొత్తాన్ని సక్రమంగా దిశలకు ప్రధాన రోడ్లను వేసుకొని, స్థలం మొత్తానికి హద్దులను ఏర్పాటు చేయాలి. అప్పుడే దిశలు స్థిరపడుతాయి. వెంచర్ చేసే స్థలానికి ముఖ్యంగా దక్షిణం-పశ్చిమం కాంపౌండును కట్టి, దానిలో దక్షిణం-పడమర- నైరుతి భాగాల్లో ప్రధానమైన టవర్లను ప్లాన్ చేయండి. ఆ తరువాత విల్లాలు (ఇండిపెండెంట్ ఇండ్లు) కట్టండి. రోడ్లు (లే అవుట్) చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఇక వెంచర్‌కు సంబంధించిన స్విమ్మింగ్‌పూల్, జిమ్ రూమ్ మొదలైన వాటిని సరైన స్థలంలో నిర్మించాలి. పడమర – దక్షిణం – నైరుతిలో స్విమ్మింగ్‌పూల్ కట్టకూడదు.
ఒకే నైరుతి గదిలో ఇద్దరు మేనేజర్లు కూర్చోవచ్చా? లేక వేర్వేరుగా ఉండాలా? మేమిద్దరం అన్నదమ్ములం.
– ఎస్. విజయ్, కోదాడ
ఒక నిర్మాణంలో ప్రధాన స్థానం ఉంటుంది. అలాగే దాని తరువాత వచ్చే రెండో గది కూడా ఉంటుంది. అంటే.. ఇక్కడ రెండో శక్తి స్థలం అనేది నా ఉద్దేశం. గదుల నెంబర్ కాదు. ఏ కంపెనీలో అయినా.. సాధారణంగా ఒక ఎండీ లేదా డైరెక్టర్ కోసం నైరుతి స్థానంలో గదిని ఏర్పాటుచేస్తారు. అది వారికి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే కొందరు అన్నదమ్ములు (ఒకే ఇంటిపేరు ఉన్నవారు) కలిసి వ్యాపారం చేస్తూ ఒకే గదిలో కూర్చుంటారు. అది దోషం మాత్రం కాదు. అలా కాకుండా అన్నదమ్ములు అయినా కూడా వేర్వేరు గదుల్లో కూర్చోవచ్చు. అప్పుడు పెద్దవారికి నైరుతి గదిని, రెండో వారికి పడమర గది లేదా దక్షిణం గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నదమ్ములు కాబట్టి ఒకేచోట కూర్చోవాలి అనేదేమీ లేదు. వీలును బట్టి సర్దుకోవచ్చు. స్థానంతోపాటు కంపెనీ విజయం కోసం అందరూ కష్టపడాలి.