వాషింగ్టన్: ఒక బాలికపై సముద్ర సింహం దాడి చేయబోయింది. అయితే ఆ చిన్నారి తృటిలో దాని బారి నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ బాలిక తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ సంఘటన జరిగింది. రోడ్డు పక్కగా ఉన్న సీ లైన్పైకి ఒక బాలిక ఎక్కి కూర్చొంది. ఆ చిన్నారి పేరెంట్స్ వీడియో తీయసాగారు. అయితే ఆ సముద్ర సింహం ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ బాలికపై దాడి చేయబోయింది. దీంతో ఆ చిన్నారి అదుపు తప్పి రోడ్డుపై పడింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి ఆ బాలికను పక్కకు తీసుకెళ్లాడు.
కాగా, రెడ్డిట్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ చిన్నారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులపై నెటిజన్లు మండిపడ్డారు. ఒక జంతువు వద్ద బాలికను ప్రమాదకరంగా ఉంచి వీడియో తీయడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక తండ్రిని తెలివి తక్కువ వ్యక్తి, ఇడియట్ అని కొందరు తిట్టారు. అతడ్ని శిక్షించాలని మరి కొందరు డిమాండ్ చేశారు.