లండన్: టాప్‌లెస్ బీఎండబ్ల్యూ కారులో వెనుకవైపు అంచున కూర్చొన్న వ్యక్తి ఉన్నట్టుండి బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడ్డాడు. ఇది చూసి అక్కడున్న వారు తెగ నవ్వుకున్నారు. బ్రిటన్‌లోని వార్విక్ బ్రిటీష్ మోటార్ మ్యూజియంలో గత ఆదివారం ‘అల్టిమేట్ బీఎండబ్ల్యూ కార్ మీట్” జరిగింది. పలువురు తమ బీఎండబ్ల్యూ కార్లలో దీనికి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం నలుగురు స్నేహితులు టాప్‌లెస్ స్టైలిస్ బీఎండబ్ల్యూ ఎం4లో ఆ వేదిక నుంచి వెళ్తున్నారు. బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి ఆ కారు వెనుక అంచుపై కూర్చొన్నాడు.
కాగా, స్పీడ్ బ్రేకర్‌ను దాటగానే డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచాడు. దీంతో కారు వెనుక అంచుపై కూర్చొన్న వ్యక్తి అదుపుతప్పి కారు నుంచి ఎగిరి వెనుక వైపు రోడ్డుపై పడ్డాడు. గమనించిన స్నేహితులు కారును ఆపారు. దీంతో రోడ్డుపై పడిన వ్యక్తి పైకి లేచి కారు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న వారు దీనిని చూసి తెగ నవ్వుకున్నారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా పలు ఇమోజీలతో కామెంట్లు చేశారు. ఖరీదైన కారు నుంచి రోడ్డుపై పడిన వ్యక్తిపై కొందరు జాలి చూపారు.