Ragpicker | చెత్త ఏరుకునే వృద్ధురాలికి ఓ బ్లాగర్ కొత్త జీవితాన్ని ప్రసాదించారు. సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు సహాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేసిన ఐఏఎస్ అధికారి అవనిష్ శర్మ… ‘హ్యుమానిటీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 90 సెకండ్ల నిడివి గల ఆ వీడియోలో ఏముందంటే..
ఓ 75 ఏండ్ల వృద్ధురాలు రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలోని కవర్లను, ఇతర వస్తువులను సేకరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చి బ్లాగర్ తరుణ్ మిశ్రా ఆ వృద్ధురాలిని చూసి చలించిపోతాడు. ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ వృద్ధురాలికి కూరగాయల బిజినెస్ పెట్టిస్తాడు. అందుకు అవసరమైన సామగ్రినంతా తనే స్వయంగా సమకూర్చి ఇస్తాడు. వృద్ధురాలిని వెంటపెట్టుకుని మార్కెట్కు వెళ్లి… ఇంట్లోకి అవసరమైన సరకుల, బట్టలు తీసిస్తాడు.
అదేవిధంగా కూరగాయలు అమ్మేందుకు బండి, వేయింగ్ మెషీన్, కొన్ని రకాల కూరగాయలు కొని తెచ్చి కొత్త వ్యాపారం పెట్టిస్తాడు. దీంతో ఆ వృద్ధురాలు ఆనందంతో పొంగిపోతుంది. తరుణ్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతుంది. మనసుల్ని హత్తుకునేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వృద్ధురాలికి సహాయం చేసిన తరుణ్ మిశ్రాను మెచ్చుకుంటున్నారు.
Humanity.🙏🙏🙏 pic.twitter.com/NUZTGEB6Cp
— Awanish Sharan (@AwanishSharan) October 18, 2022