ఢిల్లీ : దాతృత్వ కార్యక్రమాలతో అసంఖ్యాక అభిమానుల ఆదరణ పొందుతున్న నటుడు సోనూ సూద్ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎంత దూరమైనా వెళుతుంటాడు. తాజాగా తూర్పు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులను సోనూ సూద్ సమకూర్చాడు. నటుడు చేసింది చిన్న సాయమే అయినా ఓ వ్యక్తి జీవితంలో నిలదొక్కుకునేందుకు ఆసరాగా నిలిచింది.
తనకు సాయం అందించిన సోనూ సూద్ పేరుతోనే ఫుడ్ స్టాల్‌ను ఆ వ్యక్తి ప్రారంభించాడని ఆరాధన రాథోడ్ అనే యూజర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని తమ అపార్ట్మెంట్ సమీపంలో ఆరు నెలల కిందట వెలిసిన ఫుడ్ స్టాల్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతూ ఇప్పుడు మంచి వ్యాపారం సాగిస్తోందని పేర్కొన్నారు. సోనూ సూద్ సాయంతో సదరు వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడగలిగాడని పోస్ట్‌లో ప్రస్తావించారు.
ఈ పోస్ట్‌పై స్పందించిన సోనూ సూద్ తనకూ ఓ ప్లేట్ నాన్ ఇవ్వాలని సోదరుడికి చెప్పండని కామెంట్ చేశారు. సోనూ సూద్ ఫుడ్ స్టాల్ వీడియో ఇప్పటివరకూ 82,000కు పైగా వ్యూస్ రాబట్టింది. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్న సోనూ సూద్‌ను నెటిజన్లు ప్రశంసించారు. సోనూ సూద్ ఇటీవల బిహార్‌కు చెందిన బాలికకు అరుదైన సర్జరీ చేసేందుకు అవసరమైన సాయం అందించారు.