ఓ ట్విట్టర్ యూజర్ 2007లో లంచ్ కోసం వెళ్లాడు. లంచ్ పూర్తిచేసుకుని 14 ఏండ్ల తర్వాత ఇప్పుడు తిరిగొచ్చాడు. లంచ్ కోసం 14 ఏండ్లు వెళ్లడం ఏమిటి అనుకుంటున్నారా..? కానీ ఇక్కడ జరిగింది అదే. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మానవ జీవన విధానంలో నిత్యావసరాలుగా మారిపోయాయి. కొందరికైతే సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్టు పెట్టనిదే నిద్రపట్టదు.
అదేవిధంగా @deleted అనే ట్విట్టర్ యూజర్ 2007, మార్చి 15న తాను లంచ్‌కి వెళ్తున్నట్లుగా ఓ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత 14 ఏండ్లుగా అతడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ, పద్నాలుగు సంవత్సరాల తర్వాత 2021, జూలై 25న అతడు ట్విట్టర్లో మరో పోస్ట్పెట్టాడు. నేను లంచ్ నుంచి తిరిగి వచ్చేశా అని ఆ పోస్టులో పేర్కొన్నాడు. 2007లో లంచ్‌కు వెళ్తున్నాను అని పోస్ట్ చేసి, 2021లో లంచ్ నుంచి తిరిగి వచ్చాను అని పేర్కొనడంతో ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ రెండు పోస్టులపై నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్ల వర్షం కురుస్తున్నది. పద్నాలుగు ఏండ్ల నుంచి అతను లంచ్ చేస్తూనే గడిపాడా..? అని కొందరు, అతను అన్ని రోజులపాటు తిన్న ఆ పదార్థం ఏమిటి..? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో 14 ఏండ్ల క్రితం లంచ్‌కు వెళ్తున్నట్లు పోస్ట్ పెట్టి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటాడని, ఇప్పుడు పాస్వర్డ్ మళ్లీ దొరకడంతో లంచ్ నుంచి తిరిగి వచ్చినట్లు పోస్ట్ చేసి ఉంటాడని అంచనా కడుతున్నారు.
ఇంకొందరేమో ఈ ట్విట్టర్ యూజర్ 14 ఏండ్ల క్రితం లంచ్ వెళ్లున్నట్లుగా పెట్టిన పోస్టును అలాగే ఉంచి ఆ తర్వాత పోస్టులు అన్నింటిని డిలీట్ చేసి ఉంటాడని, ఆ పాత పోస్టుకు కొనసాగింపుగా ఇప్పుడు లంచ్ నుంచి తిరిగి కొత్త పోస్టు చేసి ఉంటాడని అంటున్నారు. ఇప్పుడు నా వయసు 14 ఏండ్లు, నువ్వు నా ప్రస్తుత జీవిత కాలం మొత్తం భోజనం చేస్తూనే ఉన్నావు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అతడు లంచ్‌కి వెళ్లే సమయానికి తనకు కేవలం రెండేండ్లని, ఇప్పుడు తన వయసు 16 ఏండ్లని మరో నెటిజన్ పేర్కొన్నాడు.