Shweta Tiwari | హిందీ నటి శ్వేతా తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన బ్రా కొలతలను దేవుడు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించడంతో పలువురు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన శ్వేతా తివారీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్వేతా తివారీ ప్రస్తుతం షక్ష స్టాపర్ అనే వెబ్ సిరీస్‌లో బ్రా ఫిట్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో షో స్టాపర్ వెబ్ సిరీస్ టీమ్ ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది.
ఈ క్రమంలో శ్వేతా తివారీ ఓ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. షో స్టాపర్ వెబ్ సిరీస్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. అయితే లోదుస్తుల గురించి ప్రస్తావించిన ఆమె.. తన బ్రా కొలతలను దేవుడు తీసుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ఇక ఈ సిరీస్‌లో మహాభారతం సీరియల్లో కృష్ణుని పాత్ర పోషించిన సౌరభ్ రాజ్ జైన్ కూడా నటిస్తున్నాడు. సౌరభ్ రాజ్‌ను ఆమె దేవుడితో పోల్చి.. అతను తన బ్రా కొలతలు తీసుకుంటున్నాడని జోక్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను పలువురు సీరియస్‌గా తీసుకున్నారు.
శ్వేతా తివారీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలను తాను పూర్తిగా విన్నాను. తివారీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి, నివేదికను అందజేయాలని భోపాల్ పోలీసులను హోంమంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో శ్వేతా తివారీపై భోపాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.