జూలూరుపాడు, నవంబర్ 13: ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన యువకుడు తన పత్తి చేనులో పూడ్చిపెట్టాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్థుల ద్వారా విషయం బయటకు రావడంతో నిందితుడు వీరభద్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మాచినేనిపేట తండాకు చెందిన వీరభద్రం, స్వాతి (33) ఇద్దరూ చాలా ఏండ్లుగా సహజీవనం చేస్తున్నారు. గతంలో సింగరేణి సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ జంట నుంచి రూ.16 లక్షలు తీసుకున్న విషయంలో స్వాతి, వీరభద్రం ప్రధాన సూత్రధారులు. వారికి ఉద్యోగం రాకపోవడంతో మోసపోయిన సదరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జంట వద్ద తీసుకున్న రూ.16 లక్షల విషయంలో స్వాతి, వీరభద్రం మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో హత్య చేసినట్టు పలువురు చెప్పుకుంటున్నారు. బుధవారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, తహసీల్దార్ స్వాతిబిందు, ఆర్ఐ తిరుపతిరావు గ్రామాన్ని సందర్శించి పాతిపెట్టిన ప్రాంతం నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.