Young India Police School | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్తున్న ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’లో ఫీజుల మోత మోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ప్రభుత్వం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధనతో యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభించాలని మొదట నిర్ణయించింది. మొత్తం 200 సీట్లలో 100 సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు మిగతా 100 సీట్లు సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. పోలీసు కోటాలో అమరవీరుల కుటుంబాలు, హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి అధికారుల పిల్లలు చదువుకునే అవకాశం కల్పించారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ గురువారం ప్రారంభం కానున్నది.
ఫీజులు అధికంగా ఉండటంతో అటు పోలీసు కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలు, సాధారణ పౌరులు అడ్మిషన్లకు వెనుకాడినట్టు తెలిసింది. మార్చి 21న లక్కీడ్రా తీశారు. అమరవీరుల కుటుంబాలు మినహా 2,3,4 క్యాటగిరీల్లో ఒక్కో క్లాస్‌కు 20 మందిని చొప్పున సెలెక్ట్ చేయాల్సి ఉండగా అన్ని క్లాసులకు కలిపి మొత్తం 45 మంది విద్యార్థులనే ఎంపిక చేసినట్లు తెలిసింది. వీరితోనే ఈ విద్యా సంవత్సరం కొనసాగిస్తారా? మరొసారి స్పాట్ అడ్మిషన్లకు పిలుస్తారా? అనేది తెలియాలి. కాగా, అమరవీరుల కుటుంబాలకు రూ.2వేల అడ్మిషన్ ఫీజు ఉండగా ఎస్పీ స్థాయి అధికారి పిల్లలకు రూ.20వేలు, మిగతా వారికి రూ.10వేల వరకు ఉంది. ట్యూషన్, ఇతర ఫీజులు అన్నీ కలిపి రూ.లక్ష నుంచి రూ.1.6లక్షలవరకు ఉండటంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూల్ లో ఫీజుల కోసం ఇంత దారుణంగా దోపిడీ చేయడం సమంజసం కాదని హైదరాబాద్ సూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వెంకట్ సాయినాథ్ అంటున్నారు. కేంద్రీయ, నవోదయ స్కూళ్లలో కూడా ఇంత ఫీజులులేవని వాపోతున్నారు.