హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాబందులు మనకు బంధువులేనని, పర్యావరణహితం కోసం వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ పిలుపునిచ్చింది. రాబందుల అంతర్జాతీయ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని 9 రాబందు జాతులపై రూపొందించిన పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ హైదరాబాద్ చాప్టర్ కలిసి అరణ్యభవన్‌లో శనివారం విడుదల చేశాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్, ఓఎస్డీఏ శంకరన్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హైదరాబాద్ చాప్టర్ డైరెక్టర్ ఫరీదా టంఫాలె మాట్లాడుతూ మూఢనమ్మకాలతో వేటాడటం, వాటి ఆవాసాలను నాశనం చేయడం వల్ల రాబందుల సంఖ్య దేశంలో మరింత ప్రమాదకర స్థాయికి తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాబందుల సంఖ్య పెరగాలంటే వాటిపై సరైన అవగాహన కల్పించడం అవసరమని తెలిపారు. రాబందులు మన వాతావరణంలో కుళ్లిన జంతు కళేబరాలను తింటూ పరోక్షంగా పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. రాబందుల సంఖ్య తగ్గడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సెక్రటరీ జనరల్ రవిసింగ్, నేషనల్ కన్జర్వేషన్ ప్రోగ్రాం డాక్టర్ దివాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.