Smoking | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): దేశంలో పొగాకు వినియోగం అతిపెద్ద సమస్యగా మారింది. హానికారకమని తెలిసినా చాలామంది దీని బారినపడి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. దేశంలో 25 కోట్ల మందికి పైగా పొగాకు వినియోగదారులు ఉన్నట్టు ప్రజారోగ్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏటా 13లక్షల మంది పొగాకు వినియోగం కారణంగా మరణిస్తున్నారు. దేశంలోని క్యాన్సర్ కేసుల్లో మూడింట ఒక వంతు పొగాకు వినియోగం ద్వారా సంభవిస్తున్నాయి. క్యాన్సర్తో పాటు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులకు పొగాకు వినియోగమే కారణమవుతున్నది.
క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి (సీవోపీడీ):ఊపిరితిత్తుల్లో వాయుప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడం ఇబ్బంది కరంగా మారుతుంది. క్రమంగా ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది.
పొగాకు వాడకం వల్ల ధమనులు ఇరుకుగా మారి రక్తప్రసరణ తగ్గుతుంది. తద్వారా కరోనరీ హార్ట్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అంతేకాక రక్తం గడ్డ కట్టే అవకాశం పెరుగుతుంది. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది. గుండెకు ఆక్సిజన్
సరఫరా తగ్గించడంతో పాటు గుండె కండరాన్ని బలహీన పరుస్తుంది.
ఊపిరితిత్తుల, నోటి క్యాన్సర్: ధూమపానం దాదాపు 85శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు కారణమవుతున్నది. పొగాకు వాడకంతో నోరు, గొంతు, అన్నవాహిక వంటి ఇతర క్యాన్సర్లకు దారి తీస్తున్నది.
సంతానోత్పత్తిపై ప్రభావం: ధూమపానం మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం చూపడంతో పాటు గుండెపోటుకు కారణమవుతున్నది.
చాలా మంది యువత సిగరెట్లు తాగుతున్నారు. అది అలవాటుగా మారి జీవితాలను నాశనం చేస్తున్నది. ప్రస్తుతం పొగాకు వినియోగం మానేసేందుకు పలు థెరపీలు ఉన్నాయి. నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీలో భాగంగా నికోటిన్ చూయింగమ్స్ అందుబాటులోకి వచ్చాయి. కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీతో బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. గ్రూప్ థెరపీతో పొగాకు మానేసిన వారి స్టోరీలను బాధితులకు చెప్తున్నాం. వారితోనే బాధితులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం. కొంతమంది మహిళలు కూడా సిగరెట్లు కాలుస్తున్నారు. వారిలో సంతానోత్పత్తి సమస్యలతో పాటు పుట్టిన శిశుశులకు అవిటితనం వస్తున్నది. ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజీల్లో నికోటిన్ థెరపీని స్టార్ట్ చేసింది. పొగాకు మానేయాలని అనుకునేవారు వెంటనే డీఅడిక్షన్ సెంటర్లు, సైకియాట్రిస్ట్లను సంప్రదించాలి.
-డాక్టర్ విశాల్ ఆకుల, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్రశాఖ జనరల్ సెక్రటరీ