పెద్దపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు సింగరేణి సంస్థ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది ఒక రోజు బేసిక్ పే ఇవ్వాలన్న యాజమాన్యం నిర్ణయాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ మెప్పు పొందడం కోసం తమను ముంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించడంతో ఎంతో మంది నిరాశ్రయులు కాగా.. వారికి అండగా నిలవాలని సింగరేణి సంస్థ భావించింది. సంస్థ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఒక రోజు బేసిక్ శాలరీ రికవరీకి సమ్మతించాలని ఈ నెల 11న గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీకి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీకి, సీఎంవోఏఐకి యాజమాన్యం లేఖ రాయగా కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.
‘వరద బాధితులపై మాకు సానుభూతి ఉన్నా.. ఇలా ఒక రోజు బేసిక్ పే కట్ చేసేందుకు మాత్రం ఒప్పుకోం. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల్లో అందరూ ధనవంతులు కాదు. మా కష్టాలు మాకు ఉన్నాయి. మేం తోచినంత సాయం చేస్తాం’ అని స్పష్టంచేస్తున్నారు. ఒక రోజు వేతనం కట్ చేయొద్దని, డొనేషన్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తే తమకు తోచినంత సాయం చేస్తామని పేర్కొంటూ ఈ నెల 13న పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2 కార్మికులు 60 మంది సంతకాలు చేసిన వినతి పత్రాన్ని ఓసీపీ-2 కాలరీ మేనేజర్‌కు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ సింగరేణి విస్తరించి ఉన్న 10 జిల్లాల్లోని కార్మికుల గ్రూపుల్లో హల్చల్ చేస్తుండగా.. వారి నిర్ణయానికి పెద్ద సంఖ్యలో కార్మికులు మద్దతు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు.