హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): జేబీఎం ఎలక్ట్రికల్ బస్సుల కన్సల్టెన్సీలు కార్మికుల నుంచి కట్ చేసుకుంటున్న పీఎఫ్ డబ్బులను తక్షణం వారి అకౌంట్లలో జమ చేయాలని లేనిపక్షంలో కార్మికులను కూడగట్టుకొని ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జేబీఎం బస్సుల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాల నుంచి నెలకు రూ.3వేలు పీఎఫ్ డబ్బులు కట్ చేసుకుని, 5నెలలుగా ఆ డబ్బును పీఎఫ్లో జమ చేయకుండా సొంతానికి వాడుకోవడం అన్యాయమని మండిపడ్డారు.
దీనిపై జేబీఎం, ఆర్టీసీ యాజమాన్యాలు వెంటనే స్పందించి కార్మికుల పీఎఫ్ డబ్బులను కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికుల పక్షాన ఎంప్లాయీస్ యూనియన్ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. కార్మికులు యాజమాన్యాలకు భయపడకుండా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.