రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేతకార్మికుడు బలయ్యాడు. రెండున్నరేండ్లుగా సరైన పనిలేక.. ఆర్థిక ఇబ్బందులు భరించలేక మనోవేదనకుగురై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిరిసిల్లలోని అనంతనగర్‌కు చెందిన గాజుల శ్రీనివాస్(48)కు భార్య లావణ్య, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య బీడీలు చుడుతుండగా, కొడుకు ఇటీవలే కారు వాష్ పనికి వెళ్తున్నాడు.
కూతురు డిగ్రీ చదువుతున్నది. మూడేండ్ల క్రితం సిరిసిల్లలోని చంద్రంపేట పరిధిలోని జ్యోతినగర్‌కు వచ్చి, అద్దె ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. శ్రీనివాస్ చంద్రంపేటలోనే మరమగ్గాలు నడుపుతున్నాడు. మూడేండ్ల క్రితం తుంటి ఎముక విరగడంతో అనారోగ్యం బారినపడి, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నాడు. రూ.4లక్షల వరకు అప్పులయ్యాయి. కోలుకున్న తర్వాత మరమగ్గాలు నడపడానికి వెళ్తున్నాడు.
రెండున్నరేండ్లుగా సరిగా పనిలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు పెరుగడంతో సతమతమవుతున్నాడు. కనీసం ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి. మనోవేదనకు గురైన శ్రీనివాస్ బుధవారం ఇంట్లో అద్దకం పరిశ్రమంలో ఉపయోగించే రసాయన మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.