హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రాంతానికి చెందిన పెద్దబుడి వనజను ఆదర్శంగా తీసుకుని మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. వనజ ఇంజినీరింగ్ చదివి నిర్మాణ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకుని వ్యాపారవేత్తగా ఎదిగిందని ప్రశంసించారు. తద్వారా ఆమె నెలకు రూ.లక్ష సంపాదిస్తూ మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు. సెర్ప్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వనజ.. డీఆర్డీఓ ఉమాదేవి సహకారంతో సెంట్రింగ్ వ్యాపారంలో రాణిస్తున్నట్టు తెలిపారు.