హైదరాబాద్ జనవరి 23 (నమస్తే తెలంగాణ): మహిళా, శిశు భద్రతలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని, మన రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పనితీరు అద్భుతంగా ఉన్నదని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ.. మహిళా, శిశు భద్రతలో తెలంగాణను మరింత సురక్షితంగా నిలిపేందుకు ఇంకా మెరుగ్గా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో 750 పోలీస్ స్టేషన్లలో విమెన్ హెల్ప్‌డెస్క్‌లు పనిచేస్తున్నాయని, త్వరలోనే అన్ని పీఎస్‌లలో కూడా వాటిని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. 12 యూనిట్లలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని వివరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
లైంగికదాడి కేసుల్లో విచారణలు వేగవంతం కావాలని, నేరం నిరూపించి శిక్షలు విధించేందుకు సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. 2022లో 22 లైంగికదాడి నేరస్థులను జైలుకు పంపామని చెప్పారు. అలాగే, మహిళల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిపెట్టామని, ఇప్పటికే గుర్తించిన హాట్స్పాట్ల ద్వారా పాత నేరస్థుల డాటాతో ఉకుపాదం మోపనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణవ్యాప్తంగా షీటీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. 2022లో 6,157 ఫిర్యాదులు స్వీకరించగా 521 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, 13,471 అవగాహన శిబిరాలు నిర్వహించినట్టు వివరించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విషయంలో బాగా పనిచేసే అధికారులను గుర్తించి రివార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. సమీక్షలో ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్, డీఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.