తాడ్వాయి, అక్టోబర్7: ఓ ఆర్ఎంపీ డాక్టర్(RMP )తాహతుకు మించి వైద్యం అందించడంతో ఆరోగ్యం విషమించి మహిళ మృతి(Woman died) చెందిన ఘటన ములుగు జిల్లా(Mulugu) తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జంపంగవాయి గ్రామానికి చెందిన రత్నకుమారి(43) ఊరట్టం పోస్టాఫీస్‌లో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమ్యాన్‌గా పనిచేస్తున్నది. నాలుగు రోజుల క్రితం ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో నార్లాపురంలోని ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించి వైద్యం పొందుతుంది. ఆర్ఎంపీ ఎలాంటి పరీక్షలు చేయకుండా ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇస్తూ తగ్గుతుందని ఇంటికి పంపించాడు.
ఆదివారం సాయంత్రం మళ్లీ తీవ్ర జ్వరం రావడంతో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లగా సలైన్ బాటిళ్లు ఎక్కిస్తూ, అందులో ఇంజెక్షన్లు వేస్తూ వైద్యం అందించాడు. గంట తర్వాత తనకు ఎలానో అవుతుందని తెలపడంతో డెంగ్యూ జ్వరం వచ్చిందని. వెంటనే ములుగు హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని ఆర్ఎంపీ సూచించి చేతులు దులుపుకోవడంతో కుటుంబ సభ్యులు ములుగు హాస్పిటల్‌కు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌కు తరలించాలని వైద్యులు సూచించడంతో అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమాధ్యంలో రత్నకుమారి మృతిచెందింది. ఆర్ఎంపీ వైద్యుడు రాజ్‌కుమార్ అర్హతకు మించి వైద్య అందించడం వల్లే రత్నకుమారి మృతి చెందిందని ఆరోపించారు. మృతురాలి కుమారుడు భాస్కర్ తన తల్లి మృతికి కారణమైన ఆర్ఎంపీ వైద్యడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్యకు ఫిర్యాదు చేశాడు.