పాలకుర్తి రూరల్, డిసెంబర్ 4: పెద్ద మనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా జరిమానా వేశారనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకా రం.. మజ్జిగ వీరస్వామి తన 17 గుంటల వ్యవసాయ భూమిని గ్రామానికి చెందిన బద్రికి విక్రయించాడు. అతడు డబ్బులు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అనంతరం బద్రి అదే భూమిని మజ్జిగ మల్లయ్యకు విక్రయించాడు. మనస్తాపం చెందిన వీరస్వామి (36) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామంలోని కొంతమంది పెద్దలు.. వీరస్వామి శవం ఉండగానే పంచాయితీ పెట్టారు. వీరస్వామిని మోసం చేసి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. ఆ భూమి వీరస్వామికే చెందాలని తీర్పునిచ్చారు. అంతేకాకుండా వీరస్వామి మృతికి మల్లయ్య, బద్రిలే కారణమన్నారు. ఇందుకుగాను మల్లయ్యకు రూ.7.50 లక్షలు, బద్రికి రూ.2.50 లక్షలు జరిమానా విధించారు. ఈ తీర్పుతో మనస్తాపం చెందిన మల్లయ్య భార్య పద్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను పాలకుర్తిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.