హైదరాబాద్: మద్యం ప్రియులకు చేదు వార్త. రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. ఈ నెల 27న రెండు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. దీంతో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి బహిరంగ సభలు, ర్యాలీ లు, సమావేశాల ద్వారా ప్రచారం నిషేధం. అభ్యంతకర, రాజకీయపర అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపైనా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అదేవిధంగా ఈ 48 గంటలపాటు మద్యం షాపులు కూడా బంద్ చేయాలని ఆదేశించింది.
దీంతో ఎన్నికలు జరుగనున్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వైన్ షాపులు మూతపడనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. రెండు రోజుల్లో సాధారణ మ ద్యం షాపులతోపాటు ఇతర రకాల మద్యం అమ్మకాలకు లైసెన్స్ పొందిన వారు కూడా అమ్మకాలు చేయడం లేదా సర్వ్ చేయడంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951, ఎన్నికల నియమావళి 1961 ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు హెచ్చరించారు. మద్యం ఎక్కడ అమ్మినా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.