BC Reservations | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ అసమగ్ర వైఖరి కారణంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలుపై ముప్పు పొంచి ఉన్నది. స్థానిక ఎన్నికల్లో 42% అమలు చేస్తామని తొలి నుంచి బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ అసలుకే ఎసరు తెచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్ల అమలుపైనే అనుమానం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోని ప్రభుత్వం.. అనాలోచితంగా చేపట్టిన చర్యల కారణంగా మొత్తానికే బీసీ రిజర్వేషన్ కోటా లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ‘పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తాం’ అంటూ కొత్త రాగం అందుకున్నారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. వీటినే ట్రిపుల్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. దీంతో రాష్ర్టాలు ఆర్టికల్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం ఇష్టానుసారం రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ విధానంపై కర్నాటకకు చెందిన కే కృష్ణమూర్తి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2010లో తీర్పును వెలువరించింది.
సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీ రిజర్వేషన్ల కేటాయింపునకు మూడు దశలను సూచించింది. ముందుగా అర్టికల్ 340 ద్వారా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలి. తర్వాత ఆయా వర్గాల రాజకీయ వెనకబాటుతనాన్ని గ్రామస్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో స్వతంత్రం గా ఆ కమిషన్ అధ్యయనం చేయాలి. చివరగా మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఓబీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ సిఫారసులు చేయాలి. దేశంలోని అన్ని రాష్ర్టాలు ఈ విధానాన్ని పాటించాల్సిందేనని మహారాష్ట్రకు చెం దిన వికాస్‌రావు గవాళి కేసులోనూ సుప్రీంకోర్టు స్పష్టంగా నొక్కిచెప్పింది.
బీసీ రిజర్వేషన్ పెంపు ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని నిపుణులు తేల్చిచెప్తున్నా రు. రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రణాళిక శాఖను ఆదేశిస్తూ ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో ఉత్తర్వులను జారీచేసింది. పర్యవేక్షణ బాధ్యతను బీసీ కమిషన్‌కు అప్పగిస్తూ జీవో 18ని విడుదల చేసింది. ప్రభుత్వం ఇక్కడే తొలి తప్పిదం చేసిందని నిపుణులు చెప్తున్నారు. ఇదే విషయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం హడావుడిగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ నవంబర్ మొదటి వారంలో జీవో 26ను విడుదల చేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే మొత్తం కమిషన్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌కు ఎలాంటి బాధ్యతలను అప్పగించకుండా దానిని నామమాత్రం చేసిందని విమర్శిస్తున్నారు. ఇది రెండో తప్పిదంగా వారు పేర్కొంటున్నారు. కమిషన్ ఆధ్వర్యంలో సర్వే జరగనేలేదు. దీంతో ప్రభుత్వం చెప్తున్న కులాల లెక్కలు న్యాయసమీక్షకు నిలబడవని స్పష్టంచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే లెక్కలతో డెడికేటెడ్ కమిషన్ స్థిరీకరించే రిజర్వేషన్లు సైతం చెల్లుబాటయ్యే పరిస్థితి లేదంటున్నారు.
సుప్రీంకోర్టు చెప్పిన ట్రిపుల్ టెస్ట్‌లో 50% రిజర్వేషన్ల సీలింగ్ దాటొద్దని స్పష్టంగా ఉన్నదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 56.33% మంది బీసీలు, 17.43% ఎస్సీలు, 10.45% ఎస్టీలు ఉన్నట్టు పేర్కొన్నది. దీని ఆధారంగా డెడికేషన్ కమిషన్ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. జనాభా ఆధారంగా చూస్తే 28% ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు 50% సీలింగ్ ప్రకారం బీసీలకు మిగిలేది 22% మాత్రమే. అంటే గతంలో ఉన్న 23% కన్నా ఒక శాతం తక్కువేనని చెప్తున్నారు. ఒకవేళ డెడికేటెడ్ కమిషన్ బీసీలకు 42% కోటా కల్పిస్తే.. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌తో కలిపితే 70 శాతానికి చేరుతుంది. దీనిని సుప్రీంకోర్టు అంగీకరించే పరిస్థితి లేదని గుర్తుచేస్తున్నారు. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చే రిజర్వేషన్లు కల్పించి, మిగతా సీట్లన్నీ జనరల్‌గా మార్చి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఒడిశా ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారు.
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నిరుడు ఓటరు జాబితా ఆధారంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించింది. ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధమంటూ ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీలకు 21% మినహా మిగతా అన్నిస్థానాలను జనరల్‌గా మార్చి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని చెప్తున్నారు. రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రమాదమే పొంచి ఉన్నదని, ఇదే జరిగితే గతంలో ఇచ్చిన 23% కూడా దక్కే పరిస్థితి లేదని విశ్లేషిస్తున్నారు.
సర్వేలో లోపాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఇతర పరిమితుల కారణంగా రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% కోటా ఇవ్వడం సాధ్యంకాదని కాంగ్రెస్ నాయకత్వానికి ముందే తెలుసని విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే ‘పార్టీపరంగా 42% కోటా ఇస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారని పేర్కొంటున్నారు. ఒడిశాలో బీసీ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. పార్టీపరంగా ఆ రాష్ట్రంలో బీసీల కు 50% కోటా ఇచ్చినట్టు గుర్తుచేస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వే ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు 28% కోటా ఇచ్చి.. మిగతా జనర ల్ చేస్తారని అనుమానాలు వ్యక్తంచేస్తున్నా రు. ఈ దశలో ‘పార్టీ కోటా’ వ్యాఖ్యలపై బీసీ లు భగ్గుమంటున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని పట్టుబడుతున్నారు. పార్టీపరంగా ఇస్తే ఒరిగేదేమీ ఉండదని చెబుతున్నారు.