అటవీప్రాంతంలో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యప్రాణులు వాహనాల వేగానికి బలి అవుతున్నాయి. అడవి గుండా ఉన్న రహదారిపై వేగంగా వచ్చే వాహనాలు వాటి పాలిట యమపాశంగా మారుతున్నాయి. దీంతో ఏటా వందల సంఖ్యలో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయీ దుర్ఘటనలు.
Nallamala Forest | హైదరాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి నుంచి హైదరాబాద్-శ్రీశైలం రహదారి వెళ్తుంది. దట్టమైన అడవిలో ఉండే వన్యప్రాణులు రహదారి దాటుతుండగా వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని అక్కడికక్కడే మరణిస్తున్నాయి.
హైదరాబాద్ -శ్రీశైలం రహదారిపై మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు సుమారు 70 కి.మీ నల్లమల అటవీ ప్రాంతం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి రాగానే నిబంధనల మేరకు వాహనాలను గంటకు కేవలం 30కి.మీ వేగంతోనే నడపాలి. కానీ, వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. దీంతో అడ్డుగా వచ్చే వన్యప్రాణులు వాహనాల కింద పడి మరణిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు ఐదేండ్లలో సుమారు 800పైగా వన్యప్రాణులు వాహనాల కిందపడి చనిపోయినట్టు అటవీశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రికార్డుల్లోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నట్టు సమాచారం.
హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నిత్యం వేలసంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. శని, ఆదివారాలతోపాటు ఇతర సెలవు రోజుల్లో రద్దీ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. వాహనాల వే గాన్ని తగ్గించేందుకు అటవీమార్గంలో సూచిక బోర్డులతోపాటు 35చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పా టు చేశామని అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా సూచిక బోర్డులున్నా వాహనాల వేగానికి బ్రేక్ పడటం లేదు. నిర్ణీత వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తుండటంతో నల్లమలలోని పులులు, చిరుతలు, జింకలు, అరుదైన మూషికజింకలు, సరీసృపాల వంటి అమూల్యమైన జంతుసంపదకు ముప్పుగా పరిణమిస్తున్నది. వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు, వేగానికి కళ్లెం వేసేందుకు స్పీడ్గన్లను ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులు తరచూ రోడ్డు దాటే 35చోట్ల సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశాం. అటవీమార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం.
– రోహిత్ గోపిడి, డీఎఫ్వో