హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాపూరు గ్రామానికి చెందిన శీనయ్యకు పంగలి గ్రామానికి చెందిన ధనమ్మతో ఐదేండ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ధనమ్మ పెళ్లి కాకముందే కల్యాణ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. పెండ్లయిన తర్వాత ధనమ్మ కల్యాణ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది.
ధనమ్మ ప్రవర్తనపై అనుమానం వచ్చిన శీనయ్య నిఘా పెట్టగా ఆమె వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో శీనయ్య భార్యను గట్టిగా మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. ఈ క్రమంలో భర్త శీనయ్యను వదిలించుకోవాలని పథకం వేసింది. గాఢ నిద్రలో ఉండగా ప్రియుడితో కలిసి శీనయ్య మెడకు వైర్లు చుట్టి ప్రాణం తీసింది. తర్వాత ధనమ్మ, కల్యాణ్ అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శీనయ్య, ధనమ్మ దంపతులకు మూడేండ్ల కుమార్తె ఉంది.