మారేడ్పల్లి, జూలై 21: అనుమానం తో భార్య, కుమార్తెను హత్యచేసిన భర్త ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. మహారాష్ట్ర బెగునూర్కు చెందిన గణేశ్(35), స్వప్న (30) దంపతులకు త్రివేణి, తనుశ్రీ, నక్షత్ర (11 నెలలు) సంతానం. మహారాష్ట్ర నుంచి మూడేండ్ల క్రితం న్యూబోయిన్పల్లిలోని పెద్దతోకట్టకు వచ్చి నివాసముంటున్నారు. గణేశ్ కూరగాయల ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నక్షత్ర జన్మించాక భార్యపై అనుమానంతో తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం తెల్లవారుజాము 4 గంటలకు గణేశ్ తన భార్య, కుమార్తె నక్షత్రను తాడుతో గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం డయల్ 100కు కాల్ చేసి .. భార్య, కుమార్తెను హత్య చేశానని, తాను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నానని సమాచారం అందించాడు. అప్రమత్తమైన బోయిన్పల్లి పోలీసులు అతడి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి స్వప్న, నక్షత్ర మృతి చెందిఉన్నారు. గణేశ్ సుచిత్ర సమీపంలో ఉదయం 6 గంటలకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.