హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తక్కువ ధరకే మందులు లభిస్తుండటంతో దేశంలో జనరిక్ మెడికల్ షాపులకు ఆదరణ పెరుగుతున్నది. దీంతో రాష్ట్రంలో వీటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు వీటిపై సరైన అవగాహన లేకపోవడం, అనుమానాలు ఉండటంతో పూర్తిస్థాయిలో ఆదరణ లభించడంలేదు. జనరిక్ మెడికల్ షాపులపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు స్త్రీ నిధి ద్వారా ఒక్కొక్కరికి రూ. 3 లక్షల రుణం ప్రభుత్వం అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది అర్హులున్నా రుణం అందించాలని నిర్ణయించింది. రుణాలను సులభతరం చేసేందుకు స్త్రీనిధి సంస్థ నిబంధనలను కూడా సడలించింది. దీంతో నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు చాలామంది ముందుకొచ్చారు.
కొత్త నిబంధనలు ఇవే..
జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు ఎస్‌హెచ్‌జీ సభ్యులకు మాత్రమే రుణం ఇచ్చేవారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో షాపులు ఏర్పాటు చేసేందుకు సభ్యులకు రుణం అందిస్తారు.
ఇప్పటికే అల్లోపతి మెడికల్ షాపు ఉంటే దానికి అదనంగా జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటు చేసుకున్నా రుణం ఇస్తారు.
అర్హత, ఆసక్తి ఉన్న వారందరికీ రుణాలు అందజేస్తారు.
స్త్రీనిధి రుణంతో మెడికల్ షాప్ పెట్టుకున్నా..
నేను బీ ఫార్మసీ పూర్తి చేశా. మెడికల్ షాపుల్లో పనిచేశా. మా అమ్మ ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యురాలు. స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల రుణం తీసుకొని జనరిక్ మెడికల్ షాపు పెట్టుకున్నా.. మంచిగా నడుస్తున్నది. రోజుకు రూ. 5 వేల గిరాకీ అయితున్నది. తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు.
– శ్యాం, నవీపేట (నిజామాబాద్)