హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఐఏఎస్ అధికారి పీ వెంకట్రామిరెడ్డి శాసనమండలి సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ కరీంనగర్‌కు చెందిన జే శంకర్, మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఐఏఎస్ పదవికి వెంకట్రామిరెడ్డి చేసిన రాజీనామాను కేంద్రం ఆమోదించకుండానే ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేశారని, ఆయనపై అనర్హత వేసేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ.. వెంకట్రామిరెడ్డి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, వెంటనే జీవో కూడా జారీ చేసిందని, ఆ జీవో ఆధారంగా ఎమ్మెల్సీ పదవికి ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ను ఈసీ ఆమోదించిందని వివరించారు. సర్వీసు నిబంధనల ప్రకారం రాజీనామా చేస్తేనే కేంద్రం అనుమతి అవసరమని చెప్పారు. దీంతో వెంకట్రామిరెడ్డి ఎన్నికపై హడావుడిగా పిటిషన్ ఎందుకు వేశారో చెప్పాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం పిటిషనర్లను నిలదీసింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.