e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home Top Slides హుజూరాబాద్‌ అభ్యర్థి ఎవరు?

హుజూరాబాద్‌ అభ్యర్థి ఎవరు?

  • రెడ్డి సామాజిక వర్గానికా? బీసీలకా?
  • టికెట్‌ కసరత్తులో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం
  • రెడ్డి వర్గానికైతే ఇనుగాల పెద్దిరెడ్డికి చాన్స్‌
  • బీసీల నుంచి గెల్లు, రమణ, రవి తదితరులు
  • గెల్లుకే టికెట్‌ ఇవ్వాలంటున్న పార్టీ శ్రేణులు
  • విద్యార్థులు, యువకుల మద్దతూ ఆయనకే
  • ఉద్యమకారుడు, స్థానికుడు కావడం అనుకూలం
  • మూడు నాలుగు రోజుల్లో అధిష్ఠానం నిర్ణయం


హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరు? కేసీఆర్‌ ప్రగతి ధారను ప్రజలకు చేరువ చేయబోతున్న వ్యక్తి ఎవరు? టీఆర్‌ఎస్‌ టికెట్‌ రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతుందా? లేక బీసీ వర్గాలకా? ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.

కరీంనగర్‌, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజకీయ వర్గాలే కాదు; టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కూడా ఇప్పుడు దీనిపైనే దృష్టిపెట్టింది. ఇప్పటిదాకా వివక్షకు గురైన వివిధ వర్గాలన్నింటినీ ఒక్కతాటిపై నడిపించబోయే నాయకుడు ఎవరన్న దానిపై కసరత్తు మొదలుపెట్టింది. వామపక్ష భావజాలం, తెలంగాణ చైతన్యం, ప్రగతి ఆకాంక్ష సమపాళ్లలో కలగలసి ఉండే హుజూరాబాద్‌లో ప్రధాన కులాలన్నీ ప్రబలంగానే కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని అన్ని వర్గాల ఆశలు, అభిప్రాయాలకు అనుగుణంగా తగిన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిమగ్నమైంది. ఆది నుంచి హుజూరాబాద్‌కు రెడ్డి సామాజికవర్గం ప్రాతినిధ్యం వహించింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తదుపరి దానికి బ్రేక్‌ పడింది. ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ను రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వడమా? లేక మరో పదవి ద్వారా వారికి న్యాయం చేయడమా? అన్న కోణంలో అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌ ఆలోచనా విధానానికి ఆకర్షితుడై ఇటీవలే పార్టీలో చేరిన యువ నేత కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్‌ కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారా? లేక బీసీ వర్గాలకు దక్కుతుందా? అన్న చర్చ మొదలైంది.

- Advertisement -

గణనీయ సంఖ్యలో బీసీలు
ఎమ్మెల్యే టికెట్‌ను రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలనుకుంటే బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఇనుగాల పెద్దిరెడ్డికి అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు. పెద్దిరెడ్డి సీనియర్‌ నాయకుడే కాక, ఎప్పటి నుంచో కేసీఆర్‌కు సన్నిహితుడు. అయితే ఎమ్మెల్సీ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినందున, ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో అధిష్ఠానం బీసీలవైపే మొగ్గుచూపవచ్చని భావిస్తున్నారు. అదే నిజమైతే బీసీల నుంచి అభ్యర్థి ఎంపిక ఆసక్తికరం. ఎందుకంటే హుజూరాబాద్‌లో యాదవులు, మున్నూరుకాపు, గౌడ, పద్మశాలి, ముదిరాజ్‌, రజక తదితర అన్ని బీసీ సామాజిక వర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌కు బలమైన నాయకులున్నారు. వారంతా టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నాటి నుంచి కూడా హుజూరాబాద్‌ పార్టీకి కంచుకోట. స్థానిక ఎన్నికలు మొదలుకుని అసెంబ్లీ ఎన్నికల దాకా ఇక్కడ ఎప్పుడూ టీఆర్‌ఎస్‌ ప్రభంజనమే. ఈసారి కూడా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు ముందే ఖరారైందని స్వతంత్ర సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో పార్టీ టికెట్‌ కోసం పోటీ అధికంగా ఉంది. ఒకవేళ టికెట్‌ బీసీలకే ఇస్తే, ఏ వర్గానికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? అన్నదానిపై అధిష్ఠానం అభిప్రాయ సేకరణ చేస్తున్నది.

ఆచితూచి ఎంపిక
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణ పేరు ఈ సందర్భంగా వినిపిస్తున్నది. టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన రమణ అందరికీ చిరపరిచితుడు. అదీగాకుండా టీఆర్‌ఎస్‌ ఎం తో అభిమానించే చేనేత వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన స్థానికుడు కాదు కదా అన్న అభ్యంతరాలూ వినిపిస్తున్నాయి. చేనేత వర్గం నుం చే స్వర్గం రవి, అరికాల వీరేశలింగం పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ఒకవేళ మున్నూరు కాపుల నుంచి ఎంపిక చేయాల్సి వస్తే, పొనుగంటి మల్లయ్యకు అవకా శం దక్కవచ్చని చెప్తున్నారు. ఇక అధిష్ఠానం యాదవ సా మాజిక వర్గంవైపు మొగ్గుచూపితే, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నా యకుడు, టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్‌కు టికెట్‌ దక్కవచ్చని అంటున్నారు.

పోరాట యోధుడు
‘డిగ్రీ చదువుతున్న రోజుల్లో బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్యతో కలిసి విద్యార్థుల సమస్యలపై గెల్లు అనేక పోరాటాలు చేశారు. చంద్రబాబు హయాంలో బీసీ విద్యార్థుల సాలర్‌షిప్‌ల కోసం పోరాడి అరెస్టయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. విద్యాధికుడు. యువకుడు. ఆయనకు టికెట్‌ ఇవ్వడమే సముచితం’ అని హుజూరాబాద్‌ బీసీ సంఘం నాయకుడొకరు అన్నారు. కేసీఆర్‌ 2001 టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టగా.. రాష్ట్రం కోసం గెల్లు శ్రీనివాస్‌ ఆయన అడుగులో అడుగేసి టీఆర్‌ఎస్వీ జెండా పట్టారు. ‘ఏవీ కళాశాలలో టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనే గెల్లు శ్రీనివాస్‌ విద్యార్థి సంఘం బలోపేతానికి పాటు పడ్డారు. ఆనాడు కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేస్తే యాజమాన్యంపై పోరాడాడు. ఏవీ కళాశాలలో జెండా ఆవిషరణకు ముఖ్యఅతిథిగా వచ్చిన అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాడు. ఇందుకు యాజమాన్యం ఆయనపై పోలీస్‌ కేసు పెట్టించింది. తెలంగాణకు శాపంగా మారిన 610 జీవోపై శ్రీనివాస్‌ అలుపెరగని పోరాటం చేశారు. ఉద్యోగ సంఘాల నేత విఠల్‌, కేశవరావు జాదవ్‌, యునివర్సిటీ మేధావులను ఆహ్వానించి సభను నిర్వహించారు. కేసీఆర్‌ ప్రణాళికలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను సమీకరిస్తూ పోరాటం చేశారు. విద్యార్థి పాదయాత్రల్లో పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సకల జనుల సమ్మెలో వందలాది మంది విద్యార్థులతో కలిసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. వరంగల్‌ జిల్లాలో జరిగిన పొలికేకకు వందలాది మంది విద్యార్థులను కదిలించారు. హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌ అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా నిరసన కార్యక్రమాలను దిగ్విజయం చేశారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ మీద జరిగిన మిలియన్‌ మార్చ్‌లో టీఆర్‌ఎస్వీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి తమ సత్తా చాటారు. తార్నాక బ్రిడ్జి వద్ద వరంగల్‌ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును ఉస్మానియా విశ్వవిద్యాలయం టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో అడ్డుకోగా.. పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదానికి అనుకూలంగా మాట్లాడిన విధానాన్ని నిరసిస్తూ నిజాం కళాశాల బషీర్‌బాగ్‌ వద్ద అడ్డుకున్నారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి నాగం జనార్దన్‌రెడ్డిని ఉరికించి తెలంగాణ విద్యార్థుల సత్తా ఏంటో నిరూపించిన దానిలో కీలకపాత్ర పోషించారు. గెల్లు శ్రీనివాస్‌కు టికెట్‌ ఇవ్వడమంటే తెలంగాణ పోరాటంలో పాల్గొన్న యువతను, విద్యార్థులను గౌరవించడమే. వారికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించడమే’ అని ఓయూ విద్యార్థి నేత ఒకరు అన్నారు. ‘బీసీల పేరు వాడుకునే నాయకుల్లా కాదు. గెల్లు శ్రీనివాస్‌ నికార్సయిన బీసీ బిడ్డ. నియోజకవర్గమంతటా ఆయనకు మంచి పేరుంది’ అని ఆయనతో కలసి ఉద్యమంలో పాల్గొన్న ఒక యువకుడు పేర్కొన్నారు. వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న మద్దతు, సంఘీభావం నేపథ్యంలో అధిష్ఠానం కూడా గెల్లు శ్రీనివాస్‌ వైపే మొగ్గు చూపవచ్చని అంటున్నారు. ఇప్పటికే అనేకమంది యువ నాయకులకు పదవులు, టికెట్లిచ్చిన కేసీఆర్‌ తప్పకుడా గెల్లు శ్రీనివాస్‌వైపే మొగ్గు చూపుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అన్ని కోణాలను, అన్ని సామాజికవర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ అధిష్ఠానం ముందుకు వెళ్తున్నదని, ప్రస్తుత సంకేతాలను బట్టి చూస్తే గెల్లు శ్రీనివాస్‌కే టికెట్‌ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా.. హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఎవరికి దక్కుతుందనేది మరో మూడు నాలుగు రోజుల్లో వెల్లడి కానుంది.

రేసులో గెల్లు శ్రీనివాస్‌ ముందంజ
టికెట్‌ రేసులో గెల్లు ముందంజలో ఉన్నట్టు స్థానిక నాయకులు పలువురు పేర్కొంటున్నారు. గెల్లు శ్రీనివాస్‌కే టికెట్‌ ఇవ్వాలని నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఉద్యమకారులు అనేకులు ఇప్పటికే అధిష్ఠానవర్గానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ‘గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడు. గుండెల నిండా ప్రాంతంపై ప్రేమ నింపుకొన్న వ్యక్తి. సాధారణ ఉద్యమకారుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, కేవలం తెలంగాణ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చాడు. అంచలంచెలుగా ఎదగడంతో పాటు, అందరినీ కలుపుకుని పోగలిగిన, అందరికీ అందుబాటులో ఉండగలిగిన స్వభావం ఆయన సొంతం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయన మించిన అర్హతలు ఇంకెవరికి ఉన్నాయి’ అని పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్వీ వ్యవస్థాపక నేతల్లో గెల్లు ఒకరు. ‘రాష్ట్ర సాధన కోసం ఆయన నిస్వార్థంగా పని చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయనపై 120 కేసులు నమోదయ్యాయి. ఒకసారి చంచల్‌గూడకు, ఒకసారి చర్లపల్లికి.. రెండుసార్లు జైలుకు వెళ్లారు. ఇంతకుమించి ఏం అర్హత కావాలి?’ అని హుజూరాబాద్‌లో టీబంకు నడుపుకొనే ఒక వ్యక్తి అన్నారు. ‘గెల్లు శ్రీనివాస్‌ సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. నిగర్వి. స్థానిక రాజకీయాల్లో ఈటల ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడైనా అధిష్ఠానం ఆయనకు న్యాయం చేయాలి’ అని యాదవ యువకుడు ఒకరు సూచించారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్లిన శ్రీనివాస్‌ యాదవ్‌ అంబర్‌పేట ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ దోమలగూడలోని ఏవీ కళాశాలలో బీఏ పూర్తిచేశారు. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ (జానపద కళలు)లో చేరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (రాజనీతి శాస్త్రం) అభ్యసించారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి పట్టా పొందారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ రాజనీతిశాస్త్రం విభాగంలో చేరి ‘తెలంగాణ ఉద్యమం- కేసీఆర్‌ గారి పాత్ర’ అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana