న్యూఢిల్లీ, జూన్ 3 : ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ అవాంతరాలను సృష్టించగల తీవ్ర వాతావరణ పరిస్థితులు గాడ్జిల్లా లాంటి ఎల్ నినోతో ఏర్పడే ముప్పు పొంచి ఉంది. ప్రతి దశాబ్దంలో రెండు, మూడు సార్లు సంభవించే సముద్రపు ఉష్ణ తరంగమైన ఎల్నినో భూమధ్యరేఖ చుట్టూ పసిఫిక్లో ఏర్పడుతున్నదని, అది సెప్టెంబర్లో గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. వెచ్చని సముద్ర ప్రవాహం వాతావరణ సరళిని ప్రభావితం చేసి ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతాల్లో కరువు ముప్పును పెంచుతుంది. ఇది అమెరికా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన తుపానులు, భారీ వర్షపాతం సంభవించే అవకాశాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటికే తీవ్రమైన దుర్భిక్షాలు, తుఫానులు మనం చూసినప్పటికీ వచ్చేది మాత్రం రికార్డు స్థాయిలో అత్యంత బలమైన ఎల్నినో కావచ్చని, దీనివల్ల మరింత తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చని నిపుణులు తెలిపారు.
వీటిలో వరదలు, కొండచరియలు విరిగిపడటం, కార్చిచ్చులు, కరువుకాటకాలు, యుద్ధాలు, వలసల వంటివి ఉంటాయి. ఊహించిన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డజన్ల కొద్దీ మాన్స్టర్ చిత్రాల్లో కనిపించిన భారీ డైనోసార్ లాంటి జీవి పేరు మీద వాతావరణ శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్ నినో అనే పదాన్ని వాడుతున్నారు. ఎల్ నినో శతాబ్దాలుగా వాతావరణ సంబంధిత విపత్తులను కలిగిస్తున్నది. ఉదాహరణకు 8వ శతాబ్దంలో పెరూ ప్రాచీన మోచే నాగరికత పతనానికి ఇది కారణమైందని చరిత్రకారులు భావిస్తున్నారు. కాబట్టి ప్రపంచ సరఫరా గొలుసులు, భౌగోళిక రాజకీయాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్న ఈ సమయంలో గాడిల్లా ఎల్ నినో ప్రపంచానికి ఎలాంటి పరిణామాలను తీసుకురాగలదన్న విషయమై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది.
కరువులు, వరదలను కలిగించడం ద్వారా ఎల్ నినో ప్రపంచ ఆహార వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తుందని, దీని వల్ల ఆహార ధరలు విపరీతంగా పెరిగి ఇప్పటికే ఉన్న సరఫరా గొలుసుపై ఒత్తిళ్లు మరింత తీవ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ యుద్ధానికి ముందు ప్రపంచంలోని ఎరువుల్లో దాదాపు మూడింట ఒక వంతు రవాణాకు ఉపయోగపడిన హొర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల రైతులు ఇప్పటికే అధిక ఎరువుల ధరలతో ఇబ్బందులు పడుతున్నారు.
చారిత్రకంగా ఎల్ నినో ప్రధాన ఆహార సంక్షోభాలతో ముడిపడి ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడిన 1877, 1878 నాటి తీవ్ర కరువులు ఉష్ణమండల ప్రాంతాల అంతటా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. ప్రపంచ ఆహార వ్యవస్థలోని తీవ్రమైన అసమానతలను ఇది బయటపెట్టింది. ఇటీవలే 2015 నుంచి 2016 వరకు కొనసాగిన శక్తివంతమైన ఎల్ నినో సమయంలో దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైన కరువును దక్షిణాఫ్రికా చవిచూసింది. దక్షిణాఫ్రికాలోని కీలక ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రంగా పడిపోవడం, మొక్కజొన్న పంట దిగుబడులు కుప్పకూలడం, దీంతో ఆ దేశం లక్షల టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవలసి రావడంతోఆహార ధరలు ఆకాశాన్నంటాయి.
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే తీవ్రమైన కరువు పరిస్థితులు వలసలను ప్రేరేపించగలవని, ముఖ్యంగా వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడిన ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతుందని నిపుణులు తెలిపారు. ప్రాంతాన్ని బట్టి ప్రభావాలు మారుతూ ఉంటాయి. తూర్పు ఆఫ్రికాలో ఈ ప్రభావం తరచుగా సగటుకంటే ఎక్కువ వర్షపాతానికి దారితీస్తుంది. దీనివల్ల సంభవించే వరదలు ఇండ్లను ముంచెత్తి లక్షలాది మంది ప్రజలను నిరాశ్రయులను చేస్తాయి. దీనికి విరుద్ధంగా గ్యాటెమాల, హోండురాస్, ఎల్ సాల్వడార్, నికరాగువా దేశాల్లోని కొన్ని భాగాల్లో విస్తరించి ఉన్న మధ్య అమెరికా పొడి(డ్రై) కారిడార్ సాధారణంగా ఎల్ నినో సంవత్సరాల్లో తీవ్రమైన కరువును ఎదుర్కొంటుంది. పంట నష్టాలు, ఆహార కొరతలు గ్రామీణ సమాజాలను నాశనం చేస్తాయి. దీనివల్ల చాలా మంది రైతులు పని వెతుక్కుంటూ పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లవలసి వస్తుంది.
ఎల్ నినోతో ముడిపడి ఉన్న తీవ్ర వాతావరణ పరిస్థితులు ఇప్పటికే బలహీనంగా ఉన్న దేశాల్లో అస్థిరతను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రియాశీల ఘర్షణ ప్రాంతాల్లో ఇప్పటికే క్షీణించిన సహజ వనరులపై మరింత ఒత్తిడి పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో యుద్ధంలో పాల్గొనే పక్షాలు వాటిని ఆయుధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు యెమెన్లో ఘర్షణ సమయంలో నీటి మౌలిక సదుపాయాలు పదేపదే దెబ్బతినడం లేదా అంతరాయానికి గురవడం జరిగింది. 2026 నాటి ఎల్ నినో వల్ల ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో కచ్చితంగా ఎవరూ అంచనా వేయలేరు. కానీ దాని ప్రభావాలు విస్తృతంగా ఉంటాయని నిపుణుల హెచ్చరికల ద్వారా స్పష్టమవుతున్నది. కొందరికి అవి గాడ్జిల్లా తరహాలో భయంకరంగా, ప్రమాదకరంగా ఉంటాయి.