హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యాశాఖలోని కీలక పోస్టులకు అధికారుల్లేరు. ఇప్పటికే విద్యాశాఖకు మంత్రి లేకపోగా, తాజాగా విద్యాశాఖ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం బ్రెజిల్ పర్యటనకు వెళ్లారు. యోగితారాణా విద్యాశాఖ కార్యదర్శితోపాటు ఎర్త్‌సైన్స్ వర్సిటీ ఇన్చార్జి వీసీగా, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సభ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు. నవీన్ నికోలస్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌తోపాటు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. వీరు 8వ తేదీ వరకు బ్రెజిల్లో పర్యటించనుండగా, 10వ తేదీ తర్వాతే రాష్ర్టానికి వస్తారు. 11న విధుల్లో చేరే అవకాశముంది. అయితే వీరిస్థానంలో ఎవరో ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా.. ఇంతవరకు ఎవరికి ఆ బాధ్యతలు అప్పగించలేదు.
ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణఆదిత్య ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారు. దీంతో ఈ పోస్టు ఖాళీ కాగా, ఐఏఎస్ శ్రీదేవసేనకు అదనపు బాధ్యతలప్పగించారు. ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ, కళాశాల విద్యాశాఖకు కమిషనర్‌గా, తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా శ్రీదేవసేనయే కొసాగుతున్నా రు. దీంతో మొత్తంగా విద్యాశాఖ అనాథ తీరును తలపిస్తున్నది.