హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తమ కొడుకు జీవితం బాగుపడుతదేమోనన్న ఆశతో తల్లీతండ్రులు కాయకష్టం చేసి డబ్బులు కూడబెట్టి పోలీసు ఉద్యోగానికి కోచింగ్ ఇప్పిస్తుంటే ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. నెలలు నెలలు గడిచిపోతున్నా నోటిఫికేషన్ రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పోలీసు ఉద్యోగార్థులు కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. శనివారం గాంధీభవన్‌లో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసు ఉద్యోగార్థులు అక్కడికి వెళ్లి బల్మూరి వెంకట్‌ను కలిశారు. ప్రభుత్వం కల్పిస్తామన్న ఉద్యోగాల్లో తక్షణం 15వేల కానిస్టేబుల్, 1,000 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కానిస్టేబుల్ అభ్యర్థుల వయసును 35 ఏండ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీవో 46ను రద్దు చేస్తామని తమతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు.