నిర్మల్ : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీని మొదటిసారి 63 సీట్లతో ప్రజలు ఆశీర్వదించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు జరుగుతున్న పథకాలు చూసి రెండో సారి 88 సీట్లతో గెలిపించారు. మూడోసారి ఇంతకు మించిన సీట్లతో ప్రజలు మళ్లీ గెలిపిస్తారని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా పర్యటన సందర్భంగా ఫారెస్ట్ గెస్ట్ హౌజ్లో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, అదనపు కలెక్టర్, గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల అధికారులు, ఇతర జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతు బంధు పథకం ద్వారా అన్నదాతల ఖాతాల్లో 50 వేల కోట్ల రూపాయలు జమ చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులందరికీ రైతు బంధు, సంక్రాంతి శుభాకాంక్షలు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేయడం ద్వారా రైతును రాజు చేస్తున్నారని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా రైతులు నేడు అద్భుతంగా సాగుచేస్తున్నారు. తెలంగాణ రాకముందు ఇక్కడ 30 లక్షల ఎకరాలు సాగు అయితే సీఎం కేసీఆర్ పాలనలో ఇపుడు కోటి 30 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని వివరాలను వెల్లడించారు.
దాదాపు 17వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేశాం. కల్లాల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాలు చూసి ఓర్వలేక
కొంతమంది బీజేపీ నేతలు గంగిరెద్దుల వలె వచ్చి అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉంటే అక్కడి నేతలు ఇక్కడకు వచ్చి మాట్లాడాలని సూచించారు. లేకపోతే ఇక్కడ మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
గిరిజన గ్రామాలకు 3 ఫేజ్ కరెంట్ ఉండాలని రూ.250 కోట్లు ఇచ్చారు. 75 ఏళ్లుగా నెరవేరని కల ఇప్పుడు నెరవేరుతుందన్నారు. కొమురం భీమ్ ఇన్ని రోజులు పాలించిన పార్టీలకు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే కొమురం భీం ఉద్యమ నాయకుని ప్రాంతం జోడేఘాట్ ను 30 కోట్ల రూపాయల తో కట్టించామని గుర్తు చేశారు.
హైదరాబాద్ లో 50 కోట్ల రూపాయలతో కొమురం భీం, గిరిజన భవన్ కడుతున్నాం. గత పాలకులు గిరిజనులు పేదవాళ్ళను ఓటు బ్యాంక్ గానే చూశారు. సీఎం కేసీఆర్ వచ్చిన తరవాతే వారికి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మ గౌరవం దక్కిందని మంత్రులు తెలిపారు. అందుకే మొదటి సారి కంటే రెండో సారి 15 సీట్లు ఎక్కువ ఇచ్చి గెలిపించారు. మూడోసారి అంతకంటే ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపిస్తారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో అటవీ, దేవాదాయ శాఖలో సమర్థవంతంగా పనులు జరుగుతున్నాయని ప్రశంసించారు. పోడు భూములకు త్వరలో పట్టాలు వస్తాయి. ఆ భూములకు నీరు, కరెంట్ సదుపాయం ఇచ్చి సాగు యోగ్యం చేస్తాం. రైతు బంధు, రైతు బీమా కూడా ఇస్తామన్నారు.