హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన చెందవద్దని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో వీఆర్ఏలతో మంత్రి చర్చలు జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబురాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళన విరమించి విధు ల్లో చేరాలని కోరారు. వీఆర్ఏల డిమాండ్లు, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పారు. వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ నెల 18వ తేదీతో వజ్రోత్సవ సంబురాలు ముగుస్తాయని, ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వీఆర్ఏలతో చర్చ లు జరుపుతారని వెల్లడించారు.
మంత్రి సానుకూలంగా స్పందించారు: వీఆర్ఏల జేఏసీ ప్రధాన కార్యదర్శి దాదామియా
వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని, 20వ తేదీన తమ బృందంతో చర్చలు జరుపుతామని చెప్పారని వీఆర్ఏల జేఏసీ ప్రధాన కార్యదర్శి దాదామియా చెప్పారు. 20వ తేదీ వరకు తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వీఆర్వోల వ్యవస్థ లేకపోవడంతో వీఆర్ఏలపైనే భారం పడుతున్నదని చెప్పారు. పే స్కేలు, అర్హత ఉన్నవారికి పదోన్నతులు కల్పించాలని, 50 ఏండ్లు నిండినవారికి స్వచ్చంద పదవీవిరమణ ఇచ్చి కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉన్నదని, తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.