హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జాతీయ నూతన విద్యావిధానాన్ని(ఎన్ఈపీ) అమలు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి చెప్పారు. ప్రపంచంతో తెలంగాణ విద్యార్థులు పోటీ పడాలంటే సిలబస్‌లో కూడా మార్పులు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్ఈపీ అమలు, యూజీసీ గైడ్‌లైన్స్ పాటిస్తేనే కేంద్రం రాష్ట్రానికి నిధులిచ్చే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్ఈపీని దశలవారీగా అమలుచేస్తామని చెప్పారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయం లో గురువారం చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ పురుషోత్తం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బాలకిష్టారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలకు సరిపడా బడ్జెట్, సరిపడా ఫ్యాకల్టీ లేరని, ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు నిబద్ధతతో పనిచేయడంలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత విద్యామండలిలో చాలా సమస్యలున్నాయని, వాటిని పరిషరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తనను వైస్ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రొఫెసర్ పురుషోత్తం కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత విద్యాభివృద్ధిలో తమకు సహకరించిన ఉద్యోగులకు, సిబ్బందికి ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, మాజీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు.