మహబూబ్ నగర్ : రైతు వేదికల వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి అడ్డాకుల మండల కేంద్రంలో రూ. 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదిన్నర కాలం నుంచి రైతు వేదికలు వినియోగంలో ఉన్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,603 రైతు వేదికలను పూర్తి చేశామని, రైతు వేదికలు రైతులకు శిక్షణా వేదికలుగా పని చేస్తున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించార. రైతు వేదికలను శాశ్వత వేదికలుగా వినియోగించడమే కాకుండా, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులకు కొత్త కొత్త పద్ధతులు సాగు యాజమాన్యం తదితర విషయాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, తెలంగాణలో లబ్ధి పొందని కుటుంబమే లేదని అన్నారు .ఇప్పటి వరకు రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు .
అనంతరం మంత్రులు స్థానిక ఉన్నత పాఠశాలలో మన ఊరు- మనబడి పనులకు శంకుస్థాపన చేశారు. యాదవ కమ్యూనిటీ హాల్ ను, పల్లె ప్రకృతి వనాన్ని, మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ గోపాల్ యాదవ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ నాగార్జున రెడ్డి, జడ్పీటీసి రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.