CM KCR | గోదావరి వరద ముంపున బారినపడకుండా రూ.వెయ్యికోట్లతో కరకట్టలను నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీతారామ ప్రాజెక్టు మీ కండ్ల ముందే జరుగుతున్నది. సీతమ్మ సాగర్ 37 టీఎంసీల నీటి కెపాసిటీతో ఉంటది. గోదావరి నుంచి మన ఇష్టమునన్ని నీళ్లు తీసుకోవచ్చు. పాత ఖమ్మం జిల్లాను వజ్రం తునకలా పాత ఖమ్మం తయారవుతుంది. ఏ పార్టీ వైఖరి ఏంటి.. ఎవరి నీతి ఏంది? ఎవరిని నిలబెడితే ప్రజలం నిలుబడుతాం అని ఆలోచన చేయాలి. భద్రాచలం నియోజకవర్గంలో అనేక వాగులపై ఇబ్బందులుండేవి. గర్భిణులు ప్రసవమైతే.. మంచంలో పెట్టుకొని మైళ్లకొద్దీ ఎత్తుకొని పోయే పరిస్థితి ఉండేది’ అన్నారు.
‘ఇవాళ చాలా వాగులపై హైలెవెల్ బ్రిడ్జీలు కట్టుకున్నాం. కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనం వచ్చి ఇంటి వద్ద నుంచి దర్జాగా తీసుకెళ్లి.. ప్రసవం చేయించి ఇంటి వద్ద వదిలిపెడుతున్నది. అమ్మాయి పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇస్తున్నం. గతంలో మహామహవులు మేధావులు పరిపాలించారు. వారు ఎందుకు ఇవ్వలేదో ఆలోచించాలి. గతంలో చాలా తక్కువ ఏరియాలో వంద పడకల ఆసుపత్రులు ఉండేవి. ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రులు పెట్టుకున్నాం. గతంలో మూడు కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్లు ఉండేవి. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 103 చోట్ల డయాలసిస్ సెంటర్లు పెట్టాం. పెట్టడంతో పాటు కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇస్తున్నాం. ఉచిత బస్‌పాస్‌లు సైతం ఇస్తున్నాం. మానవీయ కోణంలో ప్రజల బాధలను దూరం చేయాలని పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం’ అన్నారు.
‘ఎలక్షన్లు రాంగనే.. ఆగమైపోతే.. అలవోకగా వేయొద్దు. మనం ఓటు వేయడానికి కారణం ఉండాలి. నిజా నిజాలు తేల్చాలి. ఈ జిల్లాలో కరకటక ధమనులు మొదలయ్యారు ఇద్దరు. బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నరు. ఇంత అహంకారమా ? బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీకి ప్రజలైన మీరే కదా? ఒక వ్యక్తి కాదు కదా? ఇలాంటి దుర్మార్గుల అహంకారాన్ని అణచివేయడానికి, అలాంటి వారి తాటతీయాలి. వారికి బుద్ధి చెప్పాలి. నాలుగైదు సమస్యలు వెంకట్రావ్, రేగా కాంతారావు చెప్పారు. నేను మీకు హామీ ఇస్తున్నా’నన్నారు.
‘గతంలో వరదలు వచ్చినయ్. భద్రాచాలం నేను వచ్చాను.. పరిశీలన చేశాం. 14వేల కుటుంబాలకు ఇంటికి రూ.10వేల చొప్పున ఇచ్చాం. ఎవరైనా నష్టపోయే వారికి ఇండ్లు కట్టించాం. గోదావరి కరకట్టలు రూ.వెయ్యికోట్లతో కట్టాలని రిపోర్ట్ వచ్చింది. నేను స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి వరద నివారణకు చర్యలు తీసుకుంటాం. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే భద్రాద్రి సీతారాములను దర్శించుకొని.. ఒక పూట భద్రాచలంలో, మరొకచోట ఉంటాను. మీ మధ్యనే ఉండి రాష్ట్ర అధికారుల బృందాన్ని తీసుకొని వచ్చి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. రెండు నియోజకవర్గాల్లోని దళితులకు దళితుబంధు ఒకేసారి ఇప్పిస్తా’నన్నారు.