ఖైరతాబాద్, జనవరి 21: ఎస్సీల వర్గీకరణకు సమాజంలోని అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. ఎస్సీల వర్గీకరణకు మద్దతుగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రెడ్డి జాగృతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో మందకృష్ణ మాట్లాడారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో నిర్వహించే లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు సంఘీభావం తెలిపిటనట్టు వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల్లో తక్కువ జనాభా ఉన్న ఓ వర్గం ఎస్సీ వర్గీకరణకు అడ్డుతగులుతున్నదని, దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాలు వారే అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, బీసీ వర్గాల కోసమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదల అభ్యున్నతి కోసం కూడా ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. నాయకులు పాల్గొన్నారు.