ములుగు, నవంబర్ 2 (నమస్తేతెలంగాణ) : ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని మానుకోట మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ హెచ్చరించారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూమిలో వామపక్ష నాయకులతో కలిసి బుధవారం ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీని ములుగులో ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం గట్టమ్మ దేవాలయం వద్ద 365 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించిందన్నారు.
కేంద్ర బృందాలు సైతం వచ్చి స్థల పరిశీలన జరిపాయని, ఆ సమయంలో తరగతుల నిర్వహణకు భవనం కావాలని కోరితే జాకారం వైటీసీ భవనాన్ని సైతం అప్పగించడం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదంటూ కేంద్ర మంత్రులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలకు దమ్ముంటే యూనివర్సిటీపై కేంద్రంతో కొట్లాడాలని, లేనిపక్షంలో తానే ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ భవనం వద్ద నిరసన చేపడతానని హెచ్చరించారు.