UGC New Guidelines | వైస్ చాన్సెలర్ల నియామకంలో యూజీసీ మార్గదర్శకాలపై తెలంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పందించారు. మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్‌ను నియమించాలనుకోవడం ఏమాత్రం సరికాదన్నారు. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నాయన్నారు. యూజీసీ మార్గదర్శకాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. రాష్ట్రాల యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలున్నాయని విమర్శించారు. యూనివర్సిటీలు స్వతంత్రంగా ఉండాలన్న ఆయన.. ఈ అంశంపై ఓ కమిటీని వేసినట్లు తెలిపారు. కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఖాళీల భర్తీపై త్వరలో ప్రభుత్వ నివేదిక చైర్మన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్నత విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లుగా పదేళ్ల అనుభవం, పాలనా సామర్థ్యంతో పాటు విషయ పరిజ్ఞానం తదితర అర్హతలు ఉన్న వారిని వీసీలుగా నియమిస్తూ వస్తున్నారు. రాష్ట్రాల గవర్నర్లు వీసీల నియామకానికి మొదట నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. అన్ని కోణాల్లో అధ్యయనం చేసి ముగ్గుర్ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వివరాలను రాజ్‌భవన్‌కు పంపిస్తారు. వారిని గవర్నర్ పిలిపించి మాట్లాడి.. ఒకరిని వీసీగా నియమిస్తారు. వీసీగా ఎంపికైతే నాలుగేళ్లు విధులు నిర్వర్తిస్తారు.
యూజీసీ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు.. భవిష్యత్‌లో కార్పొరేట్ సంస్థల్లో విధులు నిర్వర్తించిన ఎగ్జిక్యూటివ్స్, సాంకేతిక నిపుణులు, బ్యూరోక్రాట్స్, ఎన్ఐటీ, ఐఐటీల్లో అధికారులుగా ఉన్న వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. యూజీసీ మార్గదర్శకాలపై పలువురు విద్యావేత్తలు విమర్శలు గుర్పించారు. వీసీల పాత్ర భిన్నంగా ఉంటుందని.. విద్యాప్రమాణాలు, క్రమశిక్షణ, కళాశాలల అవసరాలు, పాఠ్యాంశాల పరిశీలన, పరీక్షల నిర్వహణ, పరిశోధనలపై దృష్టి పెడతారని.. కార్పొరేట్, ఇతర అధికారులు అవన్నీ చేయడం సాధ్యం కాదన్నారు. అవగాహన లేని వ్యక్తులను వీసీలుగా నియమిస్తే విద్యా ప్రమాణాలు దిగజారే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.