గురుకుల సొసైటీలోని టీచర్లను సొసైటీ ఏవిధంగా ట్రీట్ చేస్తున్నదో.. బదిలీలు, గ్రీవెన్స్‌ను ఏరీతిన నిర్వహించిందో అర్థం చేసుకునేందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఫొటోనే. జీవో-317, డిస్లొకేట్ అభ్యర్థులను ఈ నెల 21వ తేదీన పిలిపించి కార్యాలయ ఆవరణలో బైక్ పార్కింగ్ షెడ్డు కింద క్రమపద్ధతి లేకుండా గ్రీవెన్స్ నిర్వహిస్తున్న అధికారులు
Gurukula Transfers | హైదరాబాద్, ఆగస్టు24 (నమస్తే తెలంగాణ): పదోన్నతుల్లో నిబంధనలన్నీ పాతరేశామని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ బాహాటంగానే చెప్పుకున్నది. నిబంధనలు, జీవోలు పక్కనపెట్టి యూనియన్ నేతల మాటలకే విలువనిచ్చి డీఎల్ ప్రమోషన్లు కల్పించామని అంగీకరించింది. గురుకుల సొసైటీలో చేపట్టిన బదిలీలు, ప్రమోషన్ల తీరుపై ‘సీఎం శాఖలోనే పదోన్నతుల అర్రాస్’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురించిన నేపథ్యంలో సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి స్పందిస్తూ, శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కథనంలో ప్రచురితమైన పలు అంశాలపై వివరణ ఇచ్చారు. బదిలీలు, ప్రమోషన్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనలన్నీ పాటించి పూర్తి పాదర్శకతతో, అందరి సమక్షంలో, జీవో-80 సమయపాలనను అనుసరిస్తూ, సీనియార్టీ జాబితాల ఆధారంగా, ఉద్యోగుల అభ్యర్థనలన్నీ పరిగణనలోకి తీసుకుని, వారి సమ్మతితోనే నిర్వహించామని వెల్లడించారు. 317 జీవోకు సంబంధించి 570 మందికి కేటాయింపులు చేశామని, ఖాళీలను బట్టి 555 మంది కాంట్రాక్టు ఉద్యోగుల పునఃకేటాయింపులు, 256 మంది అదనపు ఉద్యోగులకు పునఃకేటాయింపులు, 17 క్యాడర్లలో 854 మందికి పదోన్నతులు, 1,928 మంది ఉద్యోగుల బదిలీలు, 1,452 మందికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ల ప్రక్రియ పూర్తి చేశామని వివరించారు.
పదోన్నతుల్లో అవకతవకల్లేవ్
ప్రొవిజనల్ జాబితాలను ప్రకటించి, ఉద్యోగుల అభ్యంతరాలను స్వీకరించి, తుది సీనియార్టీ జాబితాలను ప్రచురించి నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా సొసైటీ క్యాడర్లలో అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, పోస్టింగ్‌లు ఇచ్చామని సెక్రటరీ వర్షిణి తెలిపారు. సొసైటీ వైస్‌చైర్మన్ ఆమోదం, సర్వీస్ అసోసియేషన్ల తీర్మానం మేరకే డీఎల్ లెక్చరర్లను 100% పదోన్నతుల ద్వారా భర్తీ చేశామని స్పష్టంచేశారు. గవర్నింగ్ బాడీ నిర్ణయం మేరకే అర్హులైన మహిళా అభ్యర్థులు లేకపోవడంతో పురుషులను మహిళా డిగ్రీ కాలేజీల్లో 30% కోటాలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్స్‌గా ప్రమోషన్లు కల్పించామని తెలిపారు. సొసైటీలో కొందరు డీఎల్ పురుష అభ్యర్థులు సంస్థలో ఎనిమిదేండ్లకుపైగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని, వారి సర్వీస్‌ను, సర్వీస్ అసోసియేషన్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని తాజాగా డీఎల్ ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పించామని, అం దులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లే దని పేర్కొన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు సైతం ఆన్లైన్ సౌకర్యం కల్పించామని, 789 ఫిర్యాదులు రాగా మెరిట్ ప్రకారం పరిష్కరిస్తున్నామని, జీవో-317కు సంబంధించి 560 ఫిర్యాదులను మంత్రివర్గ ఉపసంఘానికి పంపించామని తెలిపారు.
అవసరానికో నిబంధన!
సత్యం చెప్పే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం’ అనే సినిమా పాట సాం ఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు అచ్చుగుద్దినట్టుగా సరిపోతుందని, అందుకు ఉన్నతాధికారుల ప్రస్తావిస్తున్న అంశాలే నిదర్శనమని గురుకుల వర్గాలే విమర్శిస్తున్నాయి. ఇదే విషయమై సోషల్ వెల్ఫేర్ సొసైటీతోపాటు అన్ని సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సొసైటీ తీరును తూర్పారపడుతుండటంతోపాటు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
అంశాల వారీగా సంధిస్తున్న ప్రశ్నలు