Telangana | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘స్కిల్ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టాం. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. నిరుద్యోగ నిర్మూలనకు మా చిత్తశుద్ధి ఇదిగో’ అంటూ తరుచూ ప్రభుత్వం చెబుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నా పాఠశాల దశలో స్కిల్స్ నేర్పించాలన్న అంశాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. అత్యంత కీలకమైన స్కిల్స్ నేర్పించే టీచర్ పోస్టులను భర్తీచేయడంలేదు.
రాష్ట్రంలో 973 స్కిల్ కోర్సులను నేర్పించే టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1,231 పోస్టులకు ప్రస్తుతం 258 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. ముఖ్యంగా క్రాప్ట్ టీచర్ పోస్టులు 509, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ పోస్టులు 238, వొకేషనల్ టీచర్ పోస్టులు 126 ఖాళీగా ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే పాఠశాల దశలో స్కిల్ డెవలప్మెంట్కు పునాదులెలా పడతాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
100 స్కూళ్లల్లోనే..
పాఠశాల స్థాయి వృత్తివిద్యను ఇప్పటికే పలు పాఠశాలల్లో అమలుచేస్తున్నారు. రాష్ట్రం లో 26వేలకుపైగా బడులుంటే కేవలం 100 స్కూళ్లల్లోనే సమగ్రశిక్ష ద్వారా వొకేషనల్ విద్య ను అమలుచేస్తున్నారు. వొకేషనల్ టీచర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలోనే నియమిస్తున్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కోర్సులను నిర్వహించడంలో సీబీఎస్ఈ సహా మాడల్ స్కూళ్లు మం దుంజలో ఉన్నాయి. సీబీఎస్ఈ 40కి పైగా వొకేషనల్ కోర్సులను నిర్వహిస్తున్నది. రాష్ట్రం లో మాడల్ స్కూళ్లల్లో 10 కోర్సులను అమలుపరుస్తున్నారు.
9 నుంచి 12వ తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా ఏదేనీ రెండు ట్రేడ్ల ను పూర్తిచేయాలన్న నిబంధన పెట్టారు. ఇంటర్స్థాయిలోనూ ప్రభుత్వ కాలేజీల్లో వొకేషనల్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పాఠశాల దశలో స్కిల్ డెవలప్మెంట్ను పట్టించుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీచేసి, పాఠశాల దశలోనే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.