వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మిడిల్ టన్నెల్ పూర్తి చేయడానికి ఏజెన్సీ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం వారు సంప్ వైపు టన్నెల్‌పై గేటును ఏర్పాటు చేశారు. (అంటే గేటు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్నది స్పష్టం) రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు. (అంటే గోడ కూలడానికి అసలు కారణం ఇదే. నాసిరకం నిర్మాణం కాదు). అదే సమయంలో సివిల్ వర్స్ బృందాలే సైడ్‌వాల్స్ మధ్య.. టై బీమ్ కనెక్టివిటీని కాస్టింగ్ చేసే పనిలో ఉన్నాయి. (అంటే ఈ పని పూర్తి కాకముందే సొరంగం ఓపెన్ చేశారు. దీంతో గేటుకు సపోర్ట్ సరిగా లేక కొట్టుకుపోయిందన్నమాట).
రిజర్వాయర్‌కు వరద ఆలస్యంగా వస్తుందని, ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి మధ్య టన్నెల్ స్థాయికి లెవల్ పెరుగుతుందని ఏజెన్సీ భావించింది (అంటే వరద భారీగా వస్తున్నదని లెక్కలు సూచిస్తున్నా, లేటుగా వస్తుందని ఎలా అనుకున్నారు? అంటే తప్పుడు అంచనాయే ప్రమాదానికి కారణం). ఆగస్టు చివరినాటికి అవసరమైన టై బీమ్‌లను పూర్తిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో మిడిల్ టన్నెల్ కోసం గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టారు.
జూలై 29, 30, 31 తేదీల్లో గేటు బిగింపు పనులు జరిగాయి. ఇదే సమయంలో నాగార్జునసాగర్‌కు ఒకసారిగా భారీ ప్రవాహం పెరిగింది. దాదాపు 3.50 లక్షల క్యూసెకుల ఇన్‌ఫ్లో రావడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ వద్ద అకస్మాత్తుగా బ్యాక్ క్లోజ్ వేవ్ యాక్షన్ పెరిగి నీళ్లు టన్నెల్లోకి వచ్చాయి. దీంతో టన్నెల్ గేటు ధ్వంసమై.. దానికి అనుసంధానంగా ఉన్న సైడ్‌వాల్ కూలిపోయింది. (అంటే టై బీమ్ పూర్తి కాకముందే సొరంగం ఓపెన్ చేయడమే అసలు ప్రమాదానికి కారణం అన్నమాట). ఇదంతా ఐదు నిమిషాల స్వల్ప వ్యవధిలోనే జరిగింది. రిజర్వాయర్ సంపు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండిపోయింది.
– సుంకిశాల ప్రమాదంపై జలమండలి ప్రకటన
Jalamandali | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 08 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్‌లో అనూహ్యంగా నీటి ప్రవాహం పెరగడం వల్లనే సుంకిశాలలో టన్నెల్గేట్ ధ్వంసమైందని, సైడ్‌వాల్ కుప్పకూలిందని హైదరాబాద్ జలమండలి తెలిపింది. ఇప్పుడున్న నీటి లెవల్ తగ్గిన తరువాత సైడ్‌వాల్ పునఃనిర్మాణ పనులు చేపడతామని, ఇందుకు రూ.20 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. ఈ ఖర్చును నిర్మాణ సంస్థనే భరిస్తుందని జలమండలి అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వచ్చే వేసవిలోగా హైదరాబాద్ జంటనగరాలకు తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో సుంకిశాల మిడిల్ టన్నెల్ పూర్తిచేయాలని నిర్ణయించామని తెలిపారు. రిజర్వాయర్‌కు వరద ఆలస్యంగా వస్తుందని, ఈ నెలాఖరులోగా మధ్య టన్నెల్ స్థాయికి నీటి స్థాయి పెరుగుతుందన్న అంచనాతో పనులు చేపట్టామని వివరించారు. వరద ప్రవాహం పెరిగేలోగా టన్నెల్‌కు అవసరమైన టై భీమ్‌లను పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, అందులో భాగంగానే గత నెల 29, 30, 31 తేదీల్లో మధ్య సొరంగానికి గేట్‌ను అమర్చామని తెలిపారు.
రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించి, సివిల్ వర్స్ టీమ్‌లు సైడ్‌వాల్స్ మధ్య.. టై బీమ్ కనెక్టివిటీని కాస్టింగ్ చేసే పనిలో ఉండగా.. ఇంతలోనే సాగర్‌కు ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిందని పేర్కొన్నారు. దాదాపు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అకస్మాత్తుగా బ్యాక్క్లోజ్ వేవ్ యాక్షన్ పెరిగి నీళ్లు టన్నెల్లోకి తన్నుకువచ్చాయని వివరించారు. దీంతో టన్నెల్ గేటు ధ్వంసమై..దానికి అనుసంధానంగా ఉన్న సైడ్‌వాల్ కూలిపోయిందని, ఇదంతా ఐదు నిమిషాల స్వల్ప వ్యవధిలోనే జరిగిందని తెలిపారు. సైడ్‌వాల్ పొడవు 270 మీటర్లు.
వెల్ లోపల నిర్మించిన మొత్తం గోడల పొడవు సుమారు 1020 మీటర్లు ఉండగా.. ఇందులో ప్రస్తుతం 50 మీటర్ల మేర గోడ కూలిందని పేర్కొన్నారు. ఈ పనులన్నీ 2022 జూలైలో ప్రారంభమై 2023లో పూర్తయ్యాయని తెలిపారు. సైడ్‌వాల్ మొత్తం పొడవులో.. మూడు బ్లాకుల్లో కేవలం మధ్యలో ఉన్న గేటు టన్నెల్ మాత్రమే కూలిందని, ఎదురుగా ఉన్న పంప్‌హౌస్ భాగం ఇప్పటికే సాగర్ లెవల్‌కు చేరుకున్నదని అధికారులు పేర్కొన్నారు.
సుంకిశాల ప్రాజెక్టు పనులు 2021 జూలైలో ప్రారంభం కాగా.. ఇన్‌టేక్ వెల్ పనులు 2022 మార్చిలో, సైడ్‌వాల్ నిర్మాణ పనులు అదే ఏడాది జూలైలో మొదలుపెట్టామని వివరించారు. టన్నెల్ వైపున్న సైడ్‌వాల్స్ 2023 జూలైలోనే పూర్తి చేశామని తెలిపారు. 2023 డిసెంబరు నాటికి మొత్తం 4 సైడ్‌వాల్ బ్లాకుల్లో మూడు.. రిజర్వాయర్ పూర్తిస్థాయి ఎత్తు (180 మీటర్లు) వరకు పూర్తయ్యాయని తెలిపారు. సంపు ఫ్లోర్ లెవల్ 137 మీటర్లు ఉండగా.. ఈ కాలంలో 43 మీటర్ల నిర్మాణం పూర్తిచేశామని వివరించారు. ఈ ఏడాది జనవరి నాటికి నాలుగో సైడ్‌వాల్ బ్లాక్ పనులు రూఫ్ స్లాబ్ లెవల్ వరకు జరిగాయని, 2023 డిసెంబరు నాటికి అన్ని రకాల పనులు 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. సుంకిశాలలో సైడ్‌వాల్ కూలిన ఘటనపై జలమండలి ఈడీ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌తో విచారణ కమిటీని వేసినట్టు తెలిపారు.
పంప్‌హౌస్‌లోకి నీటిని ఎత్తిపోయడానికి ప్రతిపాదించిన మూడు సొరంగాల పనులు 90శాతం పూర్తయ్యాయని జలమండలి అధికారులు తెలిపారు. ప్రత్యేక నైపుణ్య కార్మికులతో ఈ పనులు జరుగుతున్నాయని, నీటి లెవల్ తగ్గిన తర్వాత.. దెబ్బతిన్న సైడ్‌వాల్ పునఃనిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. దీనికి సుమారు 20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, ఈ మొత్తాన్ని సదరు నిర్మాణ సంస్థనే భరిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు సుంకిశాల ప్రాజెక్టు ఇన్‌టేక్ వెల్ పనులు 60 శా తం, పంపింగ్ మెయిన్ పనులు 70 శా తం, ఎలక్ట్రో మెకానికల్ పనులు 40 శాతం పూర్తయ్యాయని తెలిపారు.