హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చ్ 26 (నమస్తే తెలంగాణ): కాకతీయయూనివర్సిటీ సీఐ రవికుమార్ తమపై అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారని, సివిల్ తగాదాలో తలదూర్చి బాధితమహిళలపై రౌడీషీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరిస్తున్నారని హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం రెడ్డిపురం గ్రామానికి చెందిన టేకులమ్మ, రత్నమేరీ ఆరోపించారు. బుద్ధభవన్‌లోని రాష్ట్ర మహిళాకమిషన్లో బుధవారం వారు సీఐ రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం తమ గ్రామ శివారులో సర్వేనంబర్ 126లో ఎకరం భూమి కోసం ఇరువర్గాల మధ్య కోర్టులో సివిల్ కేసు విచారణ జరుగుతున్నది. ఈ నెల 18న రజనీకర్‌రెడ్డి అనే వ్యక్తి మరి కొంతమందితో వచ్చి ఆ స్థలంలో తిష్టవేశారని, అడ్డుకునేందుకు వెళ్లిన రత్నమేరీని దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అండ చూసుకొని రజనీకర్‌రెడ్డి 2024 మే నుంచి తమ భూమిపై కన్నేశారని తెలిపారు.
గత సంవత్సరం ఆగస్ట్‌లో స్థలం చుట్టూ ఉన్న ప్రహరీగోడను, అందులో కట్టిన రూమ్‌ను కూల్చేశారని, ఈ ఏడాది ఫిబ్రవరి 24న అక్కడ ఉన్న సీసీ కెమెరాల చోరీ జరిగిందని, ఈ నెల 18న స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆమె వివరించారు. ఈ మూడు సందర్భాల్లోనూ తాము ఒంటరి మహిళలమని, తమపై దాడులు చేస్తున్నారంటూ పోలీసులు ఆశ్రయించే ప్రయత్నం చేస్తే తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారంటూ వాపోయారు. ఈ నెల 18న తమ స్థలంలోకి రజనీకర్‌రెడ్డి తన మనుషులతో వచ్చి దౌర్జన్యం చేయబోతే తాను కేయూ సీఐ రవికుమార్‌కు ఫోన్ చేశానని చెప్పారు. స్థలం దగ్గరకు వెళ్లి 100కు డయల్ చేయాలని అప్పుడు చర్యలు తీసుకుంటానని సీఐ చెప్పారని అన్నారు. సీఐ చెప్పిన విధంగానే తాము స్థలం వద్దకు వెళ్లే సరికి అక్కడ కొంతమంది ఉన్నారని, వారిలో ఒకరు తాను ఆర్ఐనని చెప్పారని తెలిపారు. ఆక్రమణదారులు, ఆర్ఐ వెళ్లిపోయిన తరువాత పోలీసులు వచ్చారని తెలిపారు.
తమ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినవారు తమను అసభ్యంగా దూషించారని తెలుపుతూ ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఎవరూ స్పందించలేదని అన్నారు. దీంతో తాము మరోసారి 100కు డయల్ చేశామని చెప్పారు. దీంతో ఈసారి పీఎస్‌లో తమ ఫిర్యాదు తీసుకున్నారని, కానీ తనపైనే ఎఫ్ఐఆర్ చేశారని రత్నమేరి వాపోయారు. అదేమని అడిగితే ఆర్ఐ మీద తాను దాడిచేశానంటూ అన్యాయంగా కేసు పెట్టారని తెలిపారు.ఈ విషయంలో కేయూ సీఐ అత్యుత్సాహం చూపించారని అన్నారు. ఒంటరి మహిళలమైన తమకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు తమపై దాడిచేస్తున్నవారికి వత్తాసు పలుకుతున్నారని, ఈ విషయంలో తనపై రౌడీషీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరిస్తున్నారని రత్నమేరి మీడియాకు వివరించారు. ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేసి తమపై అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రమహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్రపతికి, జాతీయమహిళాకమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు.