హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఫిర్యాదుల సత్వర పరిషారానికి రాష్ట్రంలో ఆన్లైన్ వర్చువల్ హియరింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. మాసబ్‌ట్యాంక్‌లోని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యాలయం నుంచి రెరా చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ మంగళవారం ఈ విధానాన్ని ప్రారంభించారు. తొలి రోజు జరిగిన వర్చువల్ హియరింగ్‌లో రెరా సభ్యులు జే లక్ష్మీనారాయణ, కే శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెరా పూర్తిస్థాయిలో ఏర్పడిన 40 రోజుల్లోనే వర్చువల్ హియరింగ్ విధానాన్ని ప్రారంభించామని, ఫిర్యాదుదారుల సౌలభ్యం కోసం నూతన టెక్నాలజీతో ఈ విధానాన్ని అమలు చేయనున్నామని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఫిర్యాదుదారులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వర్చువల్ హియరింగ్‌కు హాజరుకావచ్చని, వృద్ధాప్యంతోపాటు ఇతర సమస్యల వల్ల భౌతికంగా విచారణకు హాజరు కాలేనివారికి ఈ విధానం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు.
మరో మూడు సంస్థలకు నోటీసులు
రియల్ ఎస్టేట్ వ్యాపారులు విధిగా రెరా నిబంధనలను పాటించాలని డాక్టర్ సత్యనారాయణ సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన మరో మూడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మంగళవారం ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయా రియల్టర్లను ఆదేశించారు. నాగోల్ ఎక్స్ రోడ్డులోని సుప్రజ దవాఖాన సమీపంలో నాని డెవలపర్స్ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించి రేరా రిజిస్ట్రేషన్ లేకుండా శ్రీ లక్ష్మీనరసింహ కంట్రీ-3 పేరుతో ఆలేరు, యాదాద్రిలో వెంచర్లు చేపట్టి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కరపత్రాలు, బ్రోచర్లతో అక్రమంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్ కాలనీకి చెందిన ఆర్నా ఇన్ఫ్రా డెవలపర్స్ రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా మహేశ్వరం వద్ద ఓపెన్ ప్లాట్లు విక్రయించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఆ సంస్థకు నోటీసులు జారీచేసినట్టు చెప్పారు. కర్మన్‌ఘాట్‌లోని ఎష్యూర్డ్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా ఆరంబు, అరణ్య పేరుతో నాగార్జునసాగర్ హైవే చింతపల్లి, శ్రీశైలం హైవే ఆమనగల్ ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయాన్ని చేపట్టడంతో ఆ సంస్థకూ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు వెల్లడించారు.